Lok Sabha Polls 2024: రానున్న లోక్‌సభ ఎన్నికల్ని మహాభారత యుద్ధంతో పోల్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ జాతీయ స్థాయి సమావేశాల్లో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలపైనా తీవ్ర విమర్శలు చేశారు. రానున్న యుద్ధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అటు ప్రతిపక్షాలు మాత్రం అవినీతిలో కూరుకుపోయాయని, వారసత్వ రాజకీయాల నుంచి బయటపడలేకపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాల్ని 2G,3G,4G పార్టీలు అంటూ సెటైర్లు వేశారు. ఒకే కుటుంబంలోని రెండు, మూడు, నాలుగో తరాల వ్యక్తులు పార్టీలను నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే ప్రపంచస్థాయిలో భారత్‌కి ఇంత గుర్తింపు వచ్చిందని స్పష్టం చేశారు. మూడోసారి మోదీ సర్కార్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. 


"నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరవాతే భారత్‌ బానిసత్వపు ఆనవాళ్లను చెరిపివేసింది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన రెండో రోజు నుంచే ఇది జరగాల్సింది. కానీ...కాంగ్రెస్ హయాంలో అది జరగలేదు. అసలు ఆ  బానిసత్వ ఆనవాళ్లను వాళ్లు చెరిపేయాలని అనుకోలేదు. ప్రజలందరికీ నేనో హామీ ఇస్తున్నాను. మోదీ 3.0 ప్రభుత్వంలో దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదం అనేవే లేకుండా పోతాయి. శాంతియుతమైన దేశంగా భారత్‌ ఎదుగుతుంది"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 


 






ప్రతిపక్ష కూటమి రాజకీయాల ఎజెండా ఏంటో ఎవరికీ తెలియదని మండి పడ్డారు అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భరత భారత్‌ని లక్ష్యంగా పెట్టుకుంటే సోనియా గాంధీ మాత్రం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్క కీలక నేత తమ వారసులను మంచి పదవిలో చూసుకోవాలని చూస్తున్నారే తప్ప మరో ఆలోచనే చేయడం లేదని ఫైర్ అయ్యారు. తమ ముందు తరాల నుంచి పదవులు తెచ్చుకున్న వాళ్లు పేదల సంక్షేమం కోసం ఏం పని చేస్తారని ప్రశ్నించారు.