జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ఫెస్టివల్..


దేశ రాజధాని దిల్లీలో అతి పెద్ద షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ "దిల్లీ షాపింగ్ ఫెస్టివల్" ఈవెంట్ కారణంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టవుతుందని అన్నారు. వ్యాపారమూ పెంచుకునేందుకూ వీలవుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో ఇలాంటి ఫెస్టివల్ ఎక్కడా జరగలేదని, దిల్లీ ఇందుకు వేదికగా మారనుందని చెప్పారు. ఈ ఫెస్టివల్‌కు అనుగుణంగా అంతటా ఏర్పాటు చేస్తామని, విదేశీ అతిథుల్నీ ఆహ్వానిస్తామని చెప్పారు. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులతో పాటు ప్రజలకూ ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ఆర్థికంగా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ 30 రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్ కొనసాగనుంది.





 




అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తాం: సీఎం కేజ్రీవాల్ 


ఈ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయని, వీలైనంత మేర ప్రచారం చేసి ఎక్కువ మొత్తంలో సిటిజన్లు తరలి వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు సీఎం కేజ్రీవాల్. ఇందుకు తగ్గట్టుగానే వసతులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వేలాది మందికి ఉద్యోగాలు దొరకటంతో పాటు, దిల్లీలోని వ్యాపారుల ఉత్పత్తులకు ఈ ఫెస్టివల్ ద్వారా ప్రచారం దక్కుతుందని అన్నారు. అంతే కాదు. దూర ప్రాంతాల నుంచి ఈ ఫెస్టివల్‌కు రావాలనుకునే వారికి స్పెషల్ ఫెసిలిటీల్ ఇవ్వనున్నారు. స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఫెస్టివల్‌ సమయంలో దిల్లీ "పెళ్లి కూతురు"లా ముస్తాబై మెరిసిపోతుందని చమత్కరించారు. టెక్నాలజీ, హెల్త్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్లనూ ఏర్పాటుచేయనున్నారు. భవిష్యత్‌లో ఈ ఫెస్టివల్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.