Article 370 History: జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 'ఆర్టికల్ 370'ని (Article 370) రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు జమ్మూకశ్మీర్ (JammuKashmir) లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి, దాని వెనుక చరిత్ర, వివాదాలు, కేంద్రం ఎందుకు ఈ ఆర్టికల్ ను రద్దు చేసింది. దీని వల్ల ఎవరికి ప్రయోజనం వంటి వివరాలు ఓసారి పరిశీలిస్తే..
అసలేంటి 'ఆర్టికల్ 370'.?
దేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్ర ప్రతిపత్తి జమ్మూకశ్మీర్ కు మాత్రమే ఉంది. 1947, ఆగస్ట్ 15న భారత్, పాక్ స్వాతంత్ర్యం పొందాయి. అప్పుడు శ్రీనగర్ ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నగా భారత్ సాయం కోరిన జమ్మూ కశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారు. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ ప్రధానిగా హేక్ అబ్దుల్లాను 1949లో ప్రభుత్వం నియమించింది. రాజ ప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ నియమితులయ్యారు. 1949 అక్టోబర్ 17న కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగంలో 370 అధికరణను చేర్చింది. 1952లో ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దైంది. 1954లో 35ఏ నిబంధన జరిగి, 1956లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. 370 అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే, రాజ్యాంగంలోని 368(1) అధికరణ ద్వారా దీన్ని సవరించే వెసులుబాటు రాజ్యాంగంలో అమల్లో ఉంది.
'ఆర్టికల్ 370' ప్రకారం జమ్మూకశ్మీర్ కు కొన్ని ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం తాత్కాలిక ప్రాతిపదికన అమల్లో ఉన్నాయి. ఈ ఆర్టికల్ ప్రకారం విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, కమ్యూనికేషన్ రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్ లో కేంద్రం అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
'ఆర్టికల్ 370' రూపకర్త ఎవరంటే.?
'ఆర్టికల్ 370'ను అప్పటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. 1937 - 43 మధ్య కాలంలో ఆయన జమ్మూకశ్మీర్ సంస్థానానికి ప్రధాన మంత్రిగా పని చేశారు. 1947 అక్టోబర్ లో కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో జమ్మూకశ్మీర్ రాష్ట్ర వ్యవహారాలు ఈయనే చూసుకునేవారు. ఈయన సారథ్యంలోని బృందం 1948, 1952లో కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించింది.
ఇదీ వివాదం
కశ్మీర్ లో క్రయ విక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తినట్లు కేంద్రం తెలిపింది. దీంతో అభివృద్ధి, పారిశ్రామికీకరణకు ఆ రాష్ట్రం దూరమైనట్లు అభిప్రాయపడింది. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని, ఉగ్రదాడులకు కూడా స్థావరంగా మారడంతో 'ఆర్టికల్ 370' రద్దు అనివార్యమైనట్లు స్పష్టం చేసింది. ప్రత్యేక జెండా, రాజ్యాంగం సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చెయ్యొచ్చు. ఈ నిబంధనతోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. 'ఆర్టికల్ 370' రద్దు దిశగా అడుగులు వేశారు.
కీలక ఘట్టాలు
- 2019, ఆగస్ట్ 5న పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో 'ఆర్టికల్ 370'ను రద్దు చేసింది. దీనికి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అనుమతి తెలుపుతూ, గెజిట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణం రద్దు జరిగింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో ఢిల్లీ తరహా పాలన అమల్లోకి వచ్చింది.
- ఆగస్ట్ 6, 2019న 'ఆర్టికల్ 370' రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలను సవాల్ చేస్తూ ఎంఎల్ మిశ్రా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో తొలి పిటిషన్ దాఖలు చేశారు. కొన్నాళ్లకు మరో న్యాయవాది షకీర్ షబీర్ కూడా ఆయనకు జత కలిశారు.
- స్థానిక పౌరుల ఆమోదం లేకుండానే రాష్ట్ర హోదా మార్చారంటూ జమ్మూకశ్మీర్ లోని ప్రధాన రాజకీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆగస్ట్ 10న పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్ట్ 28న ఈ అంశాన్ని అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
- ఈ పిటిషన్లపై విచారణకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 19న సుప్రీంకోర్టు నిర్ణయం
- కొద్ది రోజుల విచారణ అనంతరం పలు పరిణామాల నేపథ్యంలో ఆగస్ట్ 2, 2023 నుంచి 'ఆర్టికల్ 370' రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. దాదాపు 23 పిటిషన్లపై 16 రోజుల విచారణ అనంతరం సెప్టెంబర్ 5న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
- డిసెంబర్ 11, 2023న 'ఆర్టికల్ 370' రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని కీలక తీర్పు వెలువరించింది. 2024, సెప్టెంబర్ 30లోగా జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
Also Read: Article 370 Abrogation: ఆర్టికల్ 370 రద్దుపై 'సుప్రీం' తీర్పు - చారిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ హర్షం