VC Sajjanar Travel on RTC Bus: తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం (Mahalaxmi Scheme) కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ (JBS)ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పథకం అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జేబీఎస్ - ప్రజ్ఞాపూర్, జేబీఎస్ - జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులోని మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్ - వెంకట్ రెడ్డి నగర్ (రూట్ నెంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ఆయన ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ అందజేశారు.


ఆర్థిక భారం తగ్గించేందుకే


ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి - మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం' పథకానికి మంచి స్పందన లభిస్తోందని సజ్జనార్ తెలిపారు. మహిళలకు ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకమని చెప్పారు. ఈ సౌకర్యాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ పథకంలో టీఎస్ఆర్టీసీ భాగస్వామ్యం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanthreddy) ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసి, వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని చెప్పారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులు సిబ్బందికి చూపించి సంస్థకు సహకరించాలని కోరారు. ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టం చేశారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు సంయమనం పాటించి సిబ్బందికి సహకరించాలని కోరారు.


'ఈ నెంబర్లకు కాల్ చేయండి'


ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎండీ సజ్జనార్ సూచించారు. 24 గంటలూ అందుబాటులో ఉండే ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లకైనా లేదా 040 - 69440000, 040 - 23450033 ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, ఖుష్రోషా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.


'మహాలక్ష్మి' మార్గదర్శకాలివే



  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచితం వర్తింపు. తెలంగాణకు చెందిన మహిళలకే ఈ సదుపాయం.

  • స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, కేంద్రం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు) ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి. ప్రయాణించే ప్రతి మహిళకు కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. 

  • రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచితం వర్తిస్తుంది.

  • ప్రత్యేక బస్సులు, స్పెషల్ టూర్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు. అలాగే మహిళలు సామూహికంగా ఓ చోటుకు వెళ్తామన్నా ఈ పథకం వర్తించదు.


Also Read: Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం, బీఆర్ఎస్ నేతల్లో వణుకు - భట్టి విక్రమార్క