Bhatti Vikramarka Comments on BRS Leaders: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై త్వరలోనే తాము శ్వేత పత్రం విడుదల చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఒక ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారని.. ఇప్పుడు తాము వారి పాలనపై, రాష్ట్ర స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని అనడంతో బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో నడిచిందని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పలు శాఖల్లో అక్రమాలు, ఫైల్స్ మాయం అవుతున్న ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.


ఇదే సమయంలో తాము శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పడంతో వారిలో ఆందోళన నెలకొంది. మధిర నియోజకవర్గ ప్రజల అండతోనే నేను ఈ ఉన్నతమైన పదవిని చేపట్టాను. ఒక చారిత్రక విజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని భట్టి విక్రమార్క అన్నారు


ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క ఆ హోదాలో తొలిసారిగా తన సొంత నియోజకవర్గం మధిరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టి.. భద్రాచల రాములవారిని దర్శించుకున్నారు. దీనిపై ఓ పోస్టు చేస్తూ.. రాములవారి ఆశీర్వాదంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా శ్రీరాముడిని సందర్శించడం ఎంతో గొప్ప అనుభూతి ఇచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు.


భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని భట్టి దర్శించుకునే సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. 


వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాముడి కంటే గొప్పగా ప్రజాపాలన అందించే దేవుడు లేడని అన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారికి రాముడే ఆదర్శం అని.. ప్రజలు కోరుకున్నది అందించే ఏకైక రాజు శ్రీరామచంద్రమూర్తి అని తెలిపారు. కాబట్టి రాముడిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాపాలన అందిస్తామని అన్నారు. 


మతసామరస్యానికి కూడా పేరుగాంచిన దేవాలయం భద్రాద్రి రామాలయం అని కొనియాడారు. ఆనాటి ముస్లిం రాజు అయిన తానీషా, హిందూ దేవుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ముత్యాల తలంబ్రాలు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి లౌకికవాదానికి ప్రతీకగా నిలిచిన రామాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సంపద పెంచుతామని, ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామని చెప్పారు.