KRMB News: కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)కి అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి.  గురువారం (ఫిబ్రవరి 1వ తేదీ) నాడు హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ మీటింగ్‌ జరిగింది. చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఈఎన్సీ సి.మురళీధర్‌, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితోపాటు పలువరు ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు. గంటన్నరపాటు జరిగిన సమావేశంలో... కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు ఒప్పుకున్నారు. పవర్​హౌస్​లు తప్ప మిగతా అన్ని ఔట్​లెట్ల నిర్వహణను బోర్డుకు అప్పగించేందుకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. 


ఈ సమావేశంలో...శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్​వే, రివర్​స్లూయిజ్​లు, పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి లిఫ్ట్‌,  నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ హెడ్‌రెగ్యులేటర్‌, నాగార్జునసాగర్‌ ఫ్లడ్‌ఫ్లో, ఏఎమ్మార్‌ ఎత్తిపోతల పథకంతో పాటు పలు అంశాలపై చర్చించారు. అంతేకాదు.. వీటి నియంత్రణ  అధికారులు కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించాయి. దీంతో... నాగార్జునసాగర్ ​ప్రాజెక్టులోని స్పిల్‌వే, రైట్, లెఫ్ట్ ​కెనాళ్ల ​హెడ్​ రెగ్యులేటర్స్, ఫ్లడ్​ఫ్లో కెనాల్ ​హెడ్​ రెగ్యులేటర్, ఏఎమ్మార్ ​లిఫ్ట్​స్కీం పంపుహౌస్, రివర్, చూట్ స్లూయిజ్​లు బోర్డు నిర్వహణలోకి వెళ్లనున్నాయి. ఆ ఔట్​లెట్ల నుంచి నీటి  విడుదల బాధ్యతలను కూడా కేఆర్ఎంబీనే పర్యవేక్షించనుంది. ఒక్కో ఔట్​లెట్ దగ్గర... తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని నియమించాలని నిర్ణయించారు.  మూడు షిఫ్టుల్లో ఆయా ఔట్​లెట్ల వద్ద రెండు రాష్ట్రాల సిబ్బంది పని చేయనున్నారు. ​నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని... సమావేశంలో నిర్ణయం  తీసుకున్నారు. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీనే తుది నిర్ణయం. 


ఏపీ ఈఎన్సీ ఏమన్నారంటే...!
కృష్ణా బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌ ఉండగా... అందులో తొమ్మిది తెలంగాణ, ఆరు ఆంధ్రప్రదేశ్‌వి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం  లేదన్నారు ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటుందని... లెఫ్ట్ కెనాల్ నుంచి రెండు టీఎంసీలు,  మార్చిలో రైట్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. 


తెలంగాణ ఈఎన్సీ ఏమన్నారంటే...!
ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్‌ఎంబీకి ఇచ్చామని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌కూడా స్పష్టం చేశారు. పవర్‌ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.  ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయని చెప్పారు. తమ డిమాండ్స్ అన్నింటిపై కేంద్రానికి లేఖలు రాశామన్న తెలంగాణ ఈఎన్సీ... ఇంకా అక్కడ నుంచి నిర్ణయం  రాలేదని చెప్పారు. ప్రాజెక్టుల దగ్గర భద్రత విషయం... అప్పటి పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందన్నారు. కేఆర్‌ఎంబీ పరిధిలోని 15  ఔట్లెట్స్ బోర్డు పరిధిలోకి  వెళ్తాయన్నారు. అయితే...  ప్రాజెక్టులను పూర్తిగా KRMBకి అప్పగించలేదని.... ఆపరేషనల్, నీటి విడుదలను మాత్రం బోర్డు చూసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ  కోసం స్టాఫ్‌ కేటాయింపు 40:45 కావాలని అడుగుతున్నారని చెప్పారు మురళీధర్‌. 


ప్రతిపక్షాల విమర్శలు
ఇక... తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 60 రోజులు కాకముందే.. సాగునీటి ప్రాజెక్టులపై  అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీ విమర్శిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులపై పూర్తి పెత్తనం కేంద్రం పరిధిలోని కృష్ణా రివర్‌  మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో... ప్రజలు అర్థంచేసుకోవాలని కోరుతోంది.