Telangana CM Revanth Reddy Adilabad Tour: లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారి పర్యటించనున్న ఆయన ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు జనాలను తరలించారు. 


గతంలో దత్తతపై ప్రకటన 


2021 ఆగస్టు 9న ఆదివాసీ గిరిజన దళిత దండోరా పేరుతో ఏర్పాటు చేసిన సభలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే సభను అధికార పార్టీగా జరుపుకుందామని అప్పుడే చెప్పారు. అంతే కాకుండా నిరాదరణకు గురైన ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


కేస్లాపూర్ నుంచి రోడ్డు మార్గంలో.. 


12 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న నాగోబా జాతలో పాల్గొంటారు. కేస్లాపూర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లి చేరుకుంటారు. పోలీసు కాల్పుల్లో అమరులైన ఆదివాసీ వీరులకు నివాళి అర్పిస్తారు. అక్కడే సుమారు కోటి రూపాయలతో ఏర్పాటు చేయబోయే స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 


మూడు గ్యారంటీలపై క్లారిటీ 


ఇదే వేదికపై ఆదిలాబాద్ జిల్లా దత్తత అంశం, మూడు గ్యారంటీలపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలపై క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఆదిలాబాద్ సెగ్మెంట్‌లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు రాలేదు. ఇక్కడ బీజేపీ పట్టు సాధించింది. ఈ పార్లమెంట్‌ పరిధిలో నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంటే... రెండు సీట్లను బీఆర్‌ఎస్‌ కైవశం చేసుకుంది. మిగిలిన ఒక సీటు కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు విజయం సాధించారు. అందుకే ఈ పార్లమెంట్ స్థానాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా ఇంద్రవెల్లి నుంచి ప్రారంభించారు. విజయం లభించిందని ఈసారి కూడా అదే సెంటిమెంట్‌తో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు.