Breaking News Live: ఎన్నికల సంస్కరణల బిల్లును కేబినెట్ ఆమోదం!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 15 Dec 2021 10:25 PM
ఎన్నికల సంస్కరణల బిల్లును కేబినెట్ ఆమోదం!

ఎన్నికల సంస్కరణల బిల్లును కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం. నాలుగు కీలక అంశాలను బిల్లులో చేర్చినట్లు అధికార వర్గాల వెల్లడించాయి. ఆధార్-ఓటర్ అనుసంధానానికి కేబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద ప్రాతిపదికన అనుసంధానానికి ఆమోదించినట్లు సమాచారం. ఏటా నాలుగు తేదీల్లో ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో పురోగతి

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో పురోగతి చోటు చేసుకుంది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. రెండు మూడు రోజుల్లో తెలుగు అకాడమీ ఖాతాలో రూ.10 కోట్లను డిపాజిట్ చేసే అవకాశం ఉంది. తెలుగు అకాడమీకి సంబంధించిన రూ. 10కోట్లను చందానగర్‌లోని కెనరా బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి డిపాజిట్ చేశారు.

మిరప చేనులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మిరప చేను వద్ద రైతు రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతున్న బస్సు డివైడర్‌ను ఢీకొని జల్లేరు వాగులో పడిపోయింది. దీంతో ఊపిరాడక ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తమిళనాడు హెలికాప్టర్ క్రాష్.. కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో చివరి వ్యక్తి కన్నుమూశారు. గత వారం రోజులుగా పోరాడుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బెంగళూరు కమాండ్ హాస్పిటల్‌ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదివరకే హెలికాప్టర్‌లో ప్రయాణిస్తోన్న సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది కన్నుమూయగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ నేడు తుదిశ్వాస విడిచారు.

సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగుల్ని పచ్చిగా మోసం చేశారు: నాదెండ్ల

‘‘ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టెక్నికల్ గా మడమ తిప్పి సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను నిలువునా ముంచారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని పాదయాత్రలో హామీలు గుప్పించి, మేనిఫెస్టోలో చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను పచ్చిగా మోసం చేశారు. కేవలం ఉద్యోగుల ఓట్లు, మద్దతు కోసమే అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ‘మాకు సాంకేతికపరమైన అంశాలు తెలియక హామీ ఇచ్చాం’ అనడం జగన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహిత్యాన్ని వెల్లడిస్తోంది. సీపీఎస్ రద్దు హామీని నీటి మీద రాతలా మార్చడంపై సలహాదారులు సన్నాయి నొక్కులు నొక్కడం కాకుండా... ముఖ్యమంత్రే స్వయంగా సమాధానం చెప్పి తాము తప్పుడు హామీ ఇచ్చామని అంగీకరించాలి.’’ జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం.. హైదరాబాద్‌లో 3 కేసులు గుర్తింపు

ఒమిక్రాన్ వైరస్ కలవరం ఇప్పుడు తెలంగాణలో మొదలైంది. హైదరాబాద్‌లో ఏకంగా మూడు ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. అబుదాబి నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇద్దరు విదేశీ ప్రయాణికులకు ఒమిక్రాన్ ఉన్నట్లుగా గుర్తించారు. వారిద్దరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో వ్యక్తి హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లగా ఆ రిపోర్టులోనూ ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాసేపట్లో డీహెచ్ విలేకరుల సమావేశం నిర్వహించి దీనిపై ప్రకటన చేయనున్నారు.

డీఎస్పీ జగన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. అరెస్టు

డీఎస్పీగా పని చేస్తున్న జగన్‌ అరెస్టయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు ఒకేసారి 10 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కోట్లకొద్దీ అక్రమంగా కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో జగన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయనతో పాటు డ్రైవర్‌ రామును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బినామీలను పెట్టుకొని అక్రమంగా కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అధికారిగా ఉండగా ఆస్తులు బాగా ఏర్పర్చుకున్నట్లుగా గుర్తించారు.

శునకం కనిపించడం లేదంటూ వ్యాపారవేత్త ఫిర్యాదు

ఇంట్లో ఉండాల్సిన పెంపుడు కుక్క కనిపించకుండా పోయిందని ఓ వ్యాపారి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షేక్‌పేట లక్ష్మీ నగర్‌ కాలనీకి చెందిన ప్రమోద్‌ కులకర్ణి అనే వ్యక్తి ఒక వ్యాపారవేత్త. అతను డాల్మిటెన్‌ జాతికి చెందిన కుక్కను ఇంట్లో పెంచుకుంటున్నాడు. ఈ నెల 13న శునకం బయటకు వచ్చింది. అప్పటి నుంచి అది కనిపించకుండా పోయిందని కులకర్ణి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి

అమరావతి: హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను నేటి ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిడదవోలు నియోజకవర్గంపై సమీక్షించనున్న చంద్రబాబు

నేడు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. నిడదవోలు నియోజకవర్గానికి కొత్త ఇన్ ఛార్జ్‌లను చంద్రబాబు నియమించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంపై సైతం చంద్రబాబు ఫోకస్ పెట్టారు.

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ సభ్యురాలు ఆలూరి లలిత మృతి

మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులు లలిత ( 76) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. ఆమె మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ నివాళులు అర్పించింది. మావోయిస్ట్ లలిత,  భుజంగారావులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. తమ ముగ్గురు కూతుళ్లను విప్లవోద్యమంలోకి నడిపించగలిగిన ఆ తల్లి తండ్రులు తమ ఏకైక కొడుకును వదలి దశాబ్ద కాలం రహస్య జీవితంలో ఉన్నారని తెలిపారు. పార్టీ అప్పగించిన విప్లవ బాధ్యతలన్నీ నెరవేర్చారన్నారు. వారిద్దరూ తమ చిన్ననాటి నుంచి వామపక్ష భావాలతో ఉంటూ, నక్సల్బరీ నుండి విప్లవోద్యమం పక్షమే దృఢంగా నిలిచారని చెప్పారు. 

ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో నైట్ హాల్టింగ్ చేసిన ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. బస్సు వెనుక భాగం స్వల్పంగా దగ్దమైంది. స్థానికులు గమనించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. నిప్పుపెట్టిన వారి కోసం ఆరా తీస్తున్న పోలీసులు.. ఇది ఆకతాయిల పనా...? లేక మావోయిస్టుల దుశ్చర్యనా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

Background

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ పంటల సాగు వేళ రైతు బంధు నగదును పంపిణీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ కానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికూ పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.  


రాష్ట్ర రైతులకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. తెలంగాణ రైతులకు పంట సాయం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకానికి  రూ. 7500 కోట్ల నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులు సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో బిజీగా ఉన్నా, రైతు బంధు నిధుల విడుదలపై అధికారులకు క్లారిటీ ఇచ్చారు.  


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.13 చొప్పున పెరిగింది. ఇలా పెరగడం వరుసగా ఇది మూడో రోజు. వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,360 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,360గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,300 గా ఉంది.


బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం తీరం వెంట వీచే బలమైన గాలుల ప్రభావంతో ఏపీలో మరో 24 గంటలు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అయితే ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు స్వల్ప ఊరట లభించింది. ఈ ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


దక్షిణ కోస్తాంధ్రంలో మాత్రం మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ మరో 24 గంటలపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.