Jonnavithula Political Party: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. తెలుగు భాష, పరిరక్షణ కోసం జై తెలుగు పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు. ఎలాంటి ప్రకటన లేకుండా నూతన పార్టీని ఆవిర్భవించారు. పార్టీ పేరు చూస్తే టీడీపీ మాదిరిగానే ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గతంలో నందమూరి తారక రామారావు తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేస్తే.. జొన్నవిత్తుల జై తెలుగు పార్టీని ఏర్పాటు చేశారని అంటున్నారు. నాయకులు, ప్రజలను చైతన్య వంతులను చేయడానికి పార్టీ పెట్టినట్లు ఆయన వివరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి ప్రకటించారు. తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకు రావాలన్నదే తన సంకల్పం అని చెప్పారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని వివరించారు. 


ఐదు రంగులతో జై తెలుగు పార్టీ జెండా..!


తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని, తెలుగు భాష, సంస్కృతి పూర్తిగా మరుగున పడిపోయిందన్నారు. వీటి కోసం నాయకులు, ప్రజలు పని చేయాలని జొన్నవిత్తుల సూచించారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులు కల్గిన పార్టీ జెండాను కూడా రూపొందించినట్లు వివరించారు. ఈ పార్టీ జెండాలో నీలం, పచ్చ, ఎరుపు, బంగారు వర్ణం, తెలుపు రంగులు ఉన్నట్లు స్పష్టం చేశారు. అలాగే జెండా వెనుక రథం గుర్తు ఉంది. ఈ ఐదు రంగులు ఐదు విషయాలను తెలియజేస్తాయన్నారు.


నీలి వర్ణం జలవనరులు, ఆకుపచ్చ రంగు వ్యవసాయ అభివృద్ధి, అరుణ వర్ణం శ్రమ శక్తి, పారిశ్రామిక అభివృద్ధి, బంగారు వర్ణం వ్యవసాయ వైభవం, తెలుపు వర్ణం సమాజంలో శాంతికి చిహ్నమని జొన్నవిత్తుల వెల్లడించారు. వెనుక తెలుగు బాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. అలాగే తెలుగు భాష కోసం ఐదుగురు మహనీయులు కృషి చేశారని.. త్యాగాలు చేశారని గుర్తు చేశారు. గిడుగు రామ్మూర్తి, కందుకూరి విరేశ లింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరింసహారావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫొటోలు తమ జై తెలుగు రాజకీయ జెండాలో, అజెండాలో ఉంటాయని వివరించారు.  


భాషను, సంప్రదాయాన్ని మర్చిపోతూ తెలుగును చులకన చేస్తున్నాం..!


తెలుగు భాష, సంస్కృతి, దాని వైభవం గురించి ప్రస్తుతం ఎవరికీ సరిగ్గా తెలియట్లేదని.. మర భాషను, సంప్రదాయాన్ని మనమే మర్చిపోతూ చులకన చేసుకుంటున్నామని జొన్నవిత్తుల అభిప్రాయ పడ్డారు. తెలంగాణ బాష మొత్తం ఒక్కటే అని... ఏపీలో మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుందన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు, రాయలసీమ ఐదు రకాల భాషలు రాష్ట్రానికి ఉన్నాయని వివరించారు. తెలుగు భాషకు వైభవాన్ని తీసుకురావాలనేది తమ ముఖ్య సంకల్పం అన్నారు. లక్షల కోట్ల బడ్జెట్, అధికారం ఉన్న ప్రభుత్వాలు తెలుగు భాషకు సమున్నత స్థానం కల్పించాలని జొన్నవిత్తుల చెప్పారు. జై తెలుగు పార్టీ ద్వారా తెలుగు భాషను పరిరక్షిస్తామన్నారు.