TDP Vs YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య రాజకీయం .. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులు మీ వాళ్లంటే.. మీ వాళ్లని ఆరోపణలు చేసుకునే వరకూ వెళ్తోంది. అసలు ఏ పార్టీ వారైతే ఏమిటి ముందు నిందితుడ్ని శిక్షించాలి కదా అనే కామన్ సెన్స్ ఈ రాజకీయంలో మిస్సవుతున్నారు. తాజాగా మచిలీపట్నంలో సతీష్ అనే యువకుడు ఓ హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన అంశంలో రాజకీయం పెరిగిపోయింది. నిందితుడు మీ పార్టీ వారంటే.. మీ పార్టీ వారని ఆరోపణలు చేసుకుంటున్నారు.
మచిలీపట్నంలో మైనర్ విద్యార్థినిపై అత్యాచారం
మచిలీపట్నంలో ముదినేపల్లి మండలంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న చెందిన మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు ఆవుల సతీష్ అనే యువకుడు. అతనికి మణికంఠ, కళ్యాణ్ సహకరించారని పోలీసులు చెబుతున్నారు. ఓ హాస్టల్‌లో ఉంటున్న మైనర్ బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేయగా, సోమవారానికి కూడా బాలిక రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ఆందోళనతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. సహకరించిన వారి కోసం వెతుకుతున్నారు.
ఆవుల సతీష్ మీ వాడంటే మీ వాడని టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు
ఆవుల సతీష్ మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టూ అనుచరుడిగా ఉన్నారు. పేర్ని కిట్టుతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆవుల సతీష్ గతంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనలోనూ ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఓ పేపర్ ప్రకటనలో ఉన్న సతీష్ ఫోటోను .. చూపిస్తూ.. వైఎస్ఆర్‌సీపీ ఆవుల సతీష్ .. టీడీపీ కార్యకర్త అని .. యువగళం పేరుతో రెచ్చగొట్టడంతోనే ఈ అత్యాచారానికి పాల్పడ్డారని వైఎస్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండి లో ఆరోపించారు.
పేర్ని కిట్టూతో సతీష్ ఉన్న ఫోటోలతో టీడీపీ కౌంటర్
అయితే తెలుగుదేశం పార్టీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. గతంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన పేర్ని కిట్టూ అనుచరుడిగా ఉన్నారని.. ఎడిటింగ్‌లతో.. టీడీపీ కార్యకర్త అని నమ్మించడానికి.. దుష్ప్రచారం చేయడం ఎందుకని టీడీపీ ప్రశ్నించింది. ఆవుల సతీష్ ఏ పార్టీలో తిరుగుతున్నాడో మచిలీపట్నం మొత్తం తెలుసని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.
నేరస్తుడు ఏ పార్టీ అయితే ఏంటి.. ?
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఏ పార్టీ వాడయితే ఏంటని.. అతనిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది కదా అని సామాన్యులు విస్తుపోతున్నారు. ఓ పార్టీ కార్యకర్త చేసిన నేరాన్ని పార్టీపై మోపడానికి... రెండు పార్టీలు హోరాహోరీగా సోషల్ మీడియా అధికారిక హ్యాండిల్స్ లోనే ఇలా దుమ్మెత్తిపోసుకోవడం విమర్శలకు కారణం అవుతోంది.