AP High Court orders : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం (Visakhapatnam)కు ప్రభుత్వ కార్యాలయాల (Government)ను తరలించవద్దని ఆదేశాలిచ్చింది. కార్యాలయాల తరలింపును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం,  కార్యాలయాలను ఇప్పుడే తరలించవద్దని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపై నమోదైన పిటిషన్లు ఏ బెంచ్ విచారణ చేపట్టాలో త్వరలోనే ప్రధాన న్యాయమూర్తి వెల్లడిస్తారని న్యాయస్థానం తెలిపింది.  ఈ పిటిషన్లను సీజే బెంచ్‌ ఎదుట ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కార్యాలయాలను తరలింపులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చింది. రాజధాని తరలింపుపై త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చే వరకు, కార్యాలయాలను తరలించబోమని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే న్యాయస్థానానికి తెలిపింది. 


చివరి దశకు నిర్మాణాలు
రుషికొండపై 4 బ్లాకుల్లో 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నివాసంతో పాటు కార్యాలయం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌ను అందంగా తీర్చిదిద్దారు.  కళింగ బ్లాక్ 5,753 చదరపు మీటర్లలో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ,   తర్వాత దాన్ని 7,266 చదరపు మీటర్లకు పెంచారు. ముఖ్యమంత్రి జగన్, కుటుంబంతో కలిసి ఉండటానికి విజయనగర బ్లాక్‌ను సిద్ధం చేశారు.  ఈ భవనం నుంచి సముద్రం అందాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. మొదట ఈ బ్లాక్‌ను 5,828 చదరపు మీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. తర్వాత 3,764 చదరపు మీటర్లకు తగ్గించారు. ఇందులోనే ప్రెసిడెన్షియల్‌ సూట్‌ రూమ్స్ ను సిద్ధం చేశారు. 1,821 చ.మీ.లతో వేంగి బ్లాక్, 690 చ.మీ.లలో గజపతి బ్లాక్‌ లను రెడీ చేశారు. రుషికొండ చుట్టూ 3 చెక్‌పోస్టులు పెట్టారు. 24 గంటలు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం కోసం హెలిప్యాడ్‌ ను నిర్మించారు. విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్‌ వినియోగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.


35 శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయింపు
35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భవనాల వినియోగంపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు  గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు కూడా  జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను రిషికొండ మిలీనియం టవర్స్‌లో గుర్తించింది.  మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు.  ముఖ్యమంత్రి జగన్, మంత్రులు విశాఖలో సమీక్షలు నిర్వహించే సమయంలో, వారంతా మిలినియం టవర్స్ లోని ఏ, బీ భవనాలను వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని స్యయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ సన్నాహక సదస్సులో వెల్లడించారు. పెట్టుబడిదారులు విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు.