Nara Lokesh: నెల్లూరులో యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మహిళలతో సమావేశం అయ్యారు. "మహాశక్తితో లోకేశ్" అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. మహిళా శక్తి పేరిట మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు సోదరి ఉంటే బాగుండేదని చిన్నప్పటి నుంచి అనుకునేవాడినని, తనకు కూతురు పుట్టాలని కోరుకున్నట్లు లోకేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను వేధించిన వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. శాసనసభ సాక్షిగా ఏ తప్పు చేయని తన తల్లిని అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన మా తల్లినే ఇంత ఘోరంగా అవమానిస్తే.. రాష్ట్రంలోని సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వైసీపీ నాయకులు చేసిన అసభ్యకర కామెంట్లకు సుమారు నెల రోజుల పాటు తన తల్లి కుమిలిపోయిందని గుర్తు చేశారు. ఆమె బాధను ప్రత్యక్షంగా చూసి.. ఓ కొడుకుగా ఏమీ చేయలేకపోయినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు ఎవరు చేసినా దానిని ఖండించాలని సూచించారు.
మహిళలపై దాడి చేయడం వైసీపీ నాయకుల జన్మహక్కు..
వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన ప్రతీ ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని లోకేశ్ అన్నారు. మహిళలపై దాడులు చేయడం వైసీపీ నాయకులు జన్మ హక్కుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకుల అక్రమాలను ప్రశ్నించిన వారిపై మరిన్ని దాడులు చేస్తున్నట్లు చెప్పారు. బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే తిరిగి వారిపై కేసులు పెడుతున్నట్లు గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ 1గా ఉంచడంమే టీడీపీ లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. రానున్న రోజుల్లో ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పేదరికం లేకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ సంకల్పించిందని హామీ ఇచ్చారు. టీడీపీ వచ్చాక డాక్టర్లు, పారిశ్రామికవేత్తలను, యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చేలా ప్రోత్సాహిస్తామని చెప్పారు. మరింత మంది విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకునివస్తే విలువలు పెరుగుతాయని అన్నారు.
అధికారంలోకి రాగానే మహాశక్తి సంక్షేమ పథకం అమలు..
టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మహాశక్తి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ పై అత్యధికంగా పన్నులు వేసి ప్రజల రక్తం పీలుస్తుందని అన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఆదాయం, కమీషన్లు కోసం మద్యపాన నిషేధాన్ని గాలికొదిలేసినట్లు పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లు ఏపీలో మద్యం నిషేధించలేరని దానికి కారణం రాబోయే 25 ఏళ్లు మద్యం ఆదాయంపై వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చిందని ఎద్దేవా చేశారు. సరైన అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మహిళకు ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు.
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో మహిళలకు పెద్ద పీఠ వేసినట్లు గుర్తు చేశారు. మహిళల సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంభన కోసం రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సున్నావడ్డీ రుణాలు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో అంగన్వాడీ టీచర్ల కష్టాలు విన్నానని వారికి తప్పకుండా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత విషయంపై మాట్లాడిని లోకేశ్ అధికారంలోకి వచ్చిన తరువాత చర్చించి తప్పుకుండా అనుకూల నిర్ణయం వచ్చేలా చేస్తామన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial