Nathan Lyon Ruled Out: 


యాషెస్‌ సిరీసులో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌! సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానాన్ని యువ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ భర్తీ చేయనున్నాడు. అతడి 'స్టాక్‌ బాల్‌' ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు సరిపోతుందని ఆసీస్‌ కోచ్‌ ధీమా వ్యక్తం చేశాడు.


మూడో మ్యాచుకు ముందు జట్టులో మార్పులు చేస్తున్నామని ఆస్ట్రేలియా ప్రకటించింది. నేథన్‌ లైయన్‌ దూరమయ్యాడని తెలిపింది. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తుండగా పిక్కల కింది భాగంలో అతడికి తీవ్ర గాయమైందని వెల్లడించింది. జట్టులో లేనప్పటికీ రిజర్వు బ్యాటర్‌ మ్యాట్‌ రెన్షా ఇంగ్లాండ్‌లోనే బస చేస్తాడని వివరించింది. ఎవరైనా గాయపడితే ముందు జాగ్రత్త చర్యగా అతడిని భర్తీ చేస్తామంది. ఇప్పటికే వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయంగా జిమ్మీ పీర్సన్‌ ఉన్నాడని తెలిపింది.


ఇంగ్లాండ్‌లో జరుగుతున్న యాషెస్‌ సిరీసులో ఆస్ట్రేలియా దూసుకెళ్తోంది. వరుసగా రెండో విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీసులో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మరొక్క మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ వారి సొంతం అవుతుంది. కాగా మూడో టెస్టులో మర్ఫీ ఆడటాన్ని ఆసీస్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌ డొనాల్డ్‌ ధ్రువీకరించాడు. లైయన్‌ సైతం అతడినే సిఫార్సు చేశాడని వెల్లడించాడు. రీసెంట్‌గా వీరిద్దరూ కలిసి చాలా టెస్టులు ఆడారని గుర్తు చేశాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మర్ఫీ రాణించాడని, 25.21 సగటుతో 14 వికెట్లు తీసుకున్నాడ వివరించాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని నాలుగు సార్లు ఔట్‌ చేశాడని గుర్తు చేశాడు.


Also Read: బెయిర్ స్టో ఔటో కాదో మీ కోచ్ ను అడగండి - ఇలాంటివి చేయడంలో ఆయన ఎక్స్పర్ట్!


'ఇంటర్నేషనల్‌ క్రికెట్లో టాడ్‌ మర్ఫీ స్టాక్‌ బాల్‌ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీలో మేం దీన్ని గమనించాం. భారత్‌లో స్పిన్‌ బౌలింగ్‌ చేయడం ఎంత కష్టమో తెలుసు కదా! మర్ఫీని ఆడటం ఆంగ్లేయులకు సులభం కాదు. ఒకవేళ వారు దూకుడుగా ఆడినా అతడీ సవాల్‌ ఎదుర్కొంటాడు. ఏదేమైనా ఇంగ్లాండ్‌లో తనదైన ముద్ర వేస్తాడు. యాషెస్‌ గొప్ప సిరీసు. ఇందులో ఆడటం అతడిని కచ్చితంగా ఉత్సాహపరుస్తుంది' అని మెక్‌ డొనాల్డ్‌ తెలిపాడు.


యాషెస్‌ సిరీసులో భాగం అయ్యేందుకు టాడ్‌ మర్ఫీ అర్హుడని లైయన్‌ సైతం అన్నాడు. 'నాలుగో రోజు ఆఖరి సెషన్లో మేమిద్దరం కలిసి పనిచేశాం. స్పిన్‌ బౌలింగ్‌ గురించి చర్చించుకున్నాం. అతడిపై నాకెంతో నమ్మకం ఉంది. అతడో చక్కని యువ ఆటగడు. ఆడే కొద్దీ నేర్చుకుంటాడు. నా ఫోనెప్పుడూ అందుబాటులోనే ఉంటుందని అతడికి చెప్పాను. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నా, మ్యాచ్‌ చూస్తున్నా ఫర్వాలేదు' అని తెలిపాడు.