Ashes Series 2023: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచినదానికంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌట్ అయిన తీరు వివాదాస్పదమైంది. ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ విసిరిన త్రో తో బెయిర్ స్టో ఔట్ అవడం.. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. లేదు అది క్రికెట్ లో నిబంధన ప్రకారమే చేశామని ఇంగ్లాండ్, ఆసీస్ మాజీలు, అభిమానులు గొంతు చించుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్ అభిమానులు దీనిని ఔట్ అంటారో లేదో తెలుసుకోవాలంటే ఆ జట్టు (టెస్టు) హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ను అడిగితే అసలు విషయాలు తెలుస్తాయని ట్విటర్ లో ఆసీస్ అభిమానులు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కు సూచిస్తున్నారు.
మెక్ కల్లమ్ కూడా ఇలా చేసినోడే..
బెయిర్ స్టో రనౌట్ తర్వాత ట్విటర్ లో.. ఏడాదికి పైగా ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా ఉంటూ టెస్టు క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న బ్రెండన్ మెక్ కల్లమ్ (న్యూజిలాండ్) ట్రెండ్ అయ్యాడు. మెక్ కల్లమ్ కు ఈ తరహా ఔట్ చేయడానికి సంబంధమేంటి..? అనుకుంటున్నారా..? సంబంధం ఉంది. ఒక్కసారి కాదు. గతంలో పలుమార్లు ఈ ‘బజ్’ (మెక్ కల్లమ్ ముద్దుపేరు) బాబు ఇలాంటి ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమైన పనులు చేసినోడే.. ఇందుకు సంబంధించి సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయి.
న్యూజిలాండ్ తరఫున ఆడినప్పుడు బ్రెండన్ వికెట్ కీపర్ గా కూడా సేవలందించాడు. ఇమే మెక్ కల్లమ్.. గతంలో శ్రీలంక, జింబాబ్వేతో పాటు ఇంగ్లాండ్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా రనౌట్స్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఓ మ్యాచ్ లో పాల్ కాలింగ్వుడ్ ను అచ్చం నిన్న కేరీ.. బెయిర్ స్టో ను ఔట్ చేసినట్టే చేశాడు. శ్రీలంకతో మ్యాచ్ లో కుమార సంగక్కర కూడా బ్రెండన్ కు బలైనవాడే.. లంకతో మ్యాచ్ లో సంగక్కర సెంచరీ చేసిన తర్వాత పరుగు పూర్తి చేసిన ముత్తయ్య మురళీధరన్ అతడికి శుభాకాంక్షలు చెప్పడానికి ముందకు వెళ్లాడు. క్రీజు వదిలిన ముత్తయ్యను బ్రెండన్ రనౌట్ చేశాడు.
జింబాబ్వే మీద కూడా..
సరే ఇంగ్లాండ్, శ్రీలంక అంటే కొంత పెద్ద జట్లు అనుకుందాం. కానీ పసికూన జింబాబ్వే మీద కూడా ఈ ‘క్రీడా స్ఫూర్తి’ హెడ్ కోచ్ ఇలాగే చేశాడు. 2005లో జింబాబ్వే - న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టులో జింబాబ్వే బ్యాటర్.. మహ్వైర్ సెంచరీ పూర్తి చేశాడు. అవతలి ఎండ్ లో ఎంపోవు.. పరుగును పూర్తి చేసి సెంచరీ చేసిన సహచరుడికి కృతజ్ఞతలు చెప్పడానికని ముందుకు వచ్చాడు. కానీ అప్పటికీ బంతిని అందుకున్న మెక్ కల్లమ్.. ఎంపోవును రనౌట్ చేశాడు.
‘గేమ్ స్పిరిట్’ అని లెక్చర్లు ఇచ్చే ముందు ఇంగ్లాండ్ ముందు ఆ జట్టు ఇతర జట్లతో వ్యవహరిస్తున్న తీరును, ఆ జట్టు హెడ్ కోచ్ గతంలో చేసిన వీడియోలను చూసి మాట్లాడితే మంచిదని నెటిజన్లు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial