AP News: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసనలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట జాగరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం విజయవాడలో ఉపాధ్యాయులకు పాత బాకాయిలు చెల్లించాలని ధర్నా కార్యక్రమం చేపట్టగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారణం అని తెలిపారు. దాన్ని నిరసిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయల ముందు జాగారణ చేపట్టారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. రావులపాలెంలో బుధవారం రాత్రి ఉపాధ్యాయులు నిరసన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. పురవీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణం అన్నారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేసి, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రవి కుమార్, నిర్మల కుమారి, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా జాగరణ..
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాత్రి జాగరణ కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బాకాయి పడ్డ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. తాము జీతాలు పెంచమని అడగడం లేదని.. తాము దాచుకున్న సొమ్మును మాత్రమే అడుగుతుంటే ఎందుకు ప్రభుత్వం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వారు హెచ్చరించారు.
నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్, ఆత్మకూరులోనూ యూటీఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు నిరసన జాగరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళనకు సిద్ధపడిన ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని కోరారు. శాంతియుతంగా ఆందోళనకు సిద్ధపడిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లించాల్సి బకాయిలు చెల్లించకుండా దౌర్జన్యాలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిరసన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ప్రకాశం జిల్లా యూటీఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ నిరసన కొనసాగించారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ లోని ఎమ్మార్సీ భవనం వద్ద యూటీఎఫ్ నాయకులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం కూడలి, అద్దంకి కూడలిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు.