Anantapuram Crime News: అతడు అందమైన జీవితాన్ని ఊహించుకున్నాడు. లక్షల్లో సంపాదిస్తూ.. కార్లలో తిరగాలనుకున్నాడు. కానీ అందుకోసం కష్టపడి సంపాదించడానికి బదులుగా అక్రమ మార్గాలను ఎంచుకున్నాడు. దొంగగా మారి బైకులే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.


అసలేం జరిగిందంటే..?


అనంతపురం జిల్లా గుంతకల్లు నగరానికి చెందిన నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి విలాస వంతమైన జీవితం కోసం.. త్వరగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. బైకు దొంగతనాలకు పాల్పడుతూ జల్సాలు చేశాడు. కానీ ఎన్నాళ్లు తప్పించుకుంటాడు. ఈ క్రమంలోనే గుంతకల్లు పోలీసులు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగానే గుంతకల్ల సీఐ రామసుబ్బయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరాలను వెల్లడించారు. కొంత కాలంగా నగరంలో బైక్ లు చోరీ కావడంతో పోలీసులు నిఘా పెట్టినట్లు సీఐ తెలిపారు. 


జిల్లాలోని పలు రద్దీ ప్రాంతాల్లో బైకులను దొంగిలించి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా గుంతకల్ పట్టమం హనుమేష్ నగర్ కు చెందిన నరేంద్ర రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వెల్లడించారు. అతని నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసే 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించామన్నారు. 


జల్సాల కోసం దొంగతనాలు - జైలుకు వెళ్లినా మారని తీరు 


విలాసవంతమైన జీవితం కోసం ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో మోటార్ సైకిళ్లే లక్ష్యంగా చోరీలు చేసే అతడు చాలా సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. తాజాగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశాడు. ఓ ఇంటి తాలం పగులగొట్టి 5 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్ దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కష్టపడి నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చిన్నతనం నుండే బడి మానేసి ఆవారాగా తిరుగుతూ బెల్లంపల్లిలో మోటార్ సైకిళ్లను దొంగలించగా బెల్లంపల్లి పోలీసులు పట్టుకొని జువైనల్ హోంకు తరలించారు. ఆ తర్వాత జువైనల్ హోం నుంచి బయటకు వచ్చినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ లోని జైల్లో శిక్ష అనుభవించాడు. వరంగల్ జైలులో ఉండగా రామకృష్ణపూర్ పోలీసులు  ఇతనిపై పీడి యాక్ట్ కూడా నమోదు చేశారు. అన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించి నవంబర్ 18వ తేదీ 2022రోజు జైలు నుంచి బయటకు వచ్చాడు. 


ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ వెళ్లిన సదరు నేరస్థుడు నవంబర్ 21వ తేదీ 2022 రోజున అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉన్న హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలించిన మోటార్ సైకిల్ పై డిసెంబర్ నెల మొదటి వారంలో వరంగల్ కు వచ్చి శివనగర్ ఏరియాలో తిరుగుతూ.. అర్ధరాత్రి ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి అక్కడ కూడా చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అయిదే ఇంటి తాళం పగులగొట్టిన నిందితుడు.. లోనికి ప్రవేశించి బీరువా తెరచి అందులోని ఉన్న డబ్బులతో పాటు వివో సెల్ ఫోన్ ను దొంగలించుకొని పారిపోయినట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నిందితుడి పట్టుకొని అరెస్ట్ చేశారు.