KTR Davos : తెలంగాణలో రూ. రెండువేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భారతీ ఎయిర్ టెల్ సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్‌లో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ప్రకటన దావోస్‌లో కేటీఆర్ సమక్షంలో చేశారు. ఎంవోయూ కుదుర్చుకున్నారు. భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ యజమాని సునీల్ భారతి మిట్టల్, కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతి ఎయిర్‌టెల్ గ్రూప్, దాని డేటా సెంటర్ విభాగం, Nxtra డేటా సెంటర్‌ల ద్వారా, మౌలిక సదుపాయాల కోసం ₹2000 కోట్లు పెట్టుబడి పెడుతుంది, ఈ సదుపాయం మొదటి దశకు 60 మెగావాట్ల (MW) IT లోడ్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రాబోయే 5-7 సంవత్సరాలలో అమలులోకి వస్తుందని.
తెలంగాణలో ఎయిర్‌టెల్-ఎన్‌ఎక్స్‌ట్రా డేటా సెంటర్లు పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారతదేశంలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌లకు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. భారతదేశంలోని మా అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో ఒకటని.. తెలంగాణతో కలిసి పని చేయడం మాకు సంతోషంగా ఉందని ఎయిర్ టెల్ యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేసిది. గత ఏడాది జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ పెట్టుబడి అంశంపై చర్చలు ప్రారంభించామని.. ఇప్పుడు అమల్లోకి వచ్చిందని తెలిపింది. కొన్ని నెలల వ్యవధిలో ప్రాజెక్ట్ నిర్మాణంలోకి వచ్చేలా చేయడానికి ప్రభుత్వం చాలా వేగంగా పని చేసిందని సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామని భారతి ఎయిర్ టెల్ తెలిపింది.
యూరోఫిన్స్ సైంటిఫిక్ (EUFI.PA) అనే సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడుల ప్రకటనలు చేసింది. ఆహారం, పర్యావరణం, ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ ఉత్పత్తులను టెస్ట్ చేయడంలో గ్లోబల్ లీడర్ గా యూరోఫిన్స్ సైంటిఫిక్ ఉంది. బయోఅనలిటికల్ టెస్టింగ్‌లో గ్లోబల్ సైంటిఫిక్ లీడర్ గా ఈ సంస్థకు గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో క్యాంపస్ పెట్టాలని నిర్ణయించుకుంది. సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ R&D, బయోఅనలిటికల్ సర్వీసెస్ (పెద్ద మరియు చిన్న అణువుల కోసం), ఇన్-వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలలో చిన్న బయోటెక్ కంపెనీలకు ఈ సంస్థ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. హైదరాబాద్‌లో పెట్టబోయే క్యాంపస్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఉంటుందని కంపెనీ తెలిపింది.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో యూరోఫిన్స్ మేనేజ్‌మెంట్‌తో మంత్రి కెటి రామారావు సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. యూరోఫిన్ సైంటిఫిక్ అనుబంధ సంస్థ యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టనున్నారు. డిస్కవరీ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ , బయోఅనలిటికల్ సర్వీస్‌లలో అదనపు సామర్థ్యంతో క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ లేబొరేటరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు యూరోఫిన్స్ సంస్థ ప్రయత్నిస్తోంది. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ R&D విలువ గొలుసులలో భారతదేశం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మా కొత్త హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభించాలని నిర్ణయించామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ పెట్టుబడితో, యూరోఫిన్స్ జీనోమ్ వ్యాలీలోని గ్లోబల్ కంపెనీల విశిష్ట జాబితాలో చేరిందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.