Telugu News: ఎక్కడ పేకాట ఆడాలన్నా పోలీసుల భయం.. అందుకే ఓ ఆ వ్యక్తి తన బుర్రకి పదును పెట్టాడు. ఓ బొలెరో వాహనాన్ని తీసుకొని దాని చుట్టూ ఒక తార్పాల పట్టా కట్టి వాహనం లోపల ఓ సెటప్ చేశాడు. లోపల పేకాట రాయుళ్లు పేకాటను ఆడుతుంటారు. ఆ బొలెరో వాహనం మాత్రం నగర వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండే ఉద్దేశంతో బొలెరో వాహనం రోడ్డు మీద తిరుగుతూనే ఉంటుంది. కాకపోతే లోపల మాత్రం వారి ఆట కొనసాగుతూనే ఉంటుంది. రన్నింగ్ బొలెరో వాహనంలో పేకాట ఆడుతున్నారని ఓ గుర్తు తెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
 
ఎవరికీ అనుమానం కలగకుండా బొలెరా వాహనానికి చుట్టూ పట్ట (టార్పాలిన్)కట్టి రన్నింగ్ వాహనం లోపల పేకాట ఆడుతున్న 16 మంది పేకాటరాయుళ్ల గుట్టు అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. కూడేరు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు (డిసెంబర్ 28) జల్లిపల్లి టోల్ గేట్ వద్ద బొలెరో వాహనంతో సహా 16 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి బొలెరో వాహనం, రూ.1,44,680 నగదు, 16 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన రమణ ఇందులో కీలకమైన నిందితుడని పోలీసులు తేల్చారు. ఇతను తన సొంత బొలెరో వాహనానికి టార్పాలిన్ పట్టా కట్టి మొబైల్ గ్యాంబ్లింగ్ కు ఉపయోగిస్తున్నాడు. బొలెరో రన్నింగ్ లో ఉంటూనే పేకాట ఆడిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం రావడంతో ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది బృందంగా వెళ్లి వీరిని పట్టుకున్నారు.