Hindu Temple in Dubai:
దసరా ముందు రోజు కొత్త ఆలయం..
విజయదశమి సందర్భంగా...దుబాయ్‌లో కొత్త ఆలయం కొలువు దీరింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్ వేదికగా.. దుబాయ్‌లోని కొత్త టెంపుల్ వీడియోని షేర్ చేశారు. ఇందులో ఆలయం ఎంతో అందంగా కనిపిస్తోంది. వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు ఇందులో కొలువు దీరారు. "విజయదశమి సందర్భంగా దుబాయ్‌లోని ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సారి దుబాయ్‌కి వెళ్లినప్పుడు కచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తాను" అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ ఆలయాన్ని దసరాకు ముందు రోజు..భారత్, దుబాయ్‌కు చెందిన ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. 200 మంది ప్రముఖులు, దౌత్యవేత్తలతో సహా స్థానిక నేతలూ ఇందులో పాల్గొన్నారు. జెబల్ అలీ ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించారు. ఈ ప్రాంతంలోనే 9 పుణ్య క్షేత్రాలున్నాయి. వీటిలో 7 చర్చ్‌లుకాగా, ఓ గురుద్వారా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఆలయం వచ్చి చేరింది. దుబాయ్‌లో నిర్మించిన రెండో హిందూ ఆలయం ఇదే. 1958లో మొదటి సారి ఆలయాన్ని కట్టారు.
హిందూ ఆలయాలపై దాడులు
ఇటీవలి కాలంలో విదేశాల్లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ వద్ద ఉన్న శిలాఫలకంపై గుర్తు తెలియన వ్యక్తులు "ఖలిస్థాన్ జిందాబాద్" అనే నినాదాలు రాశారు. అటు పక్కనే హిందుస్థాన్‌ను అనుమానించే విధంగా స్లోగన్స్ రాశారు. స్థానికంగా ఇది పెద్ద అలజడికి కారణమైంది. రాత్రికి రాత్రే వీటిపై ఎవరు రాశారన్న అంశంపై సరైన విచారణ జరపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. టోర్నటోలో ఉన్న ఈ ఆలయం అక్కడ ఎంతో ప్రసిద్ధి. దీనిపై ఇండియన్ హై కమిషన్ (Indian High Commission) తీవ్రంగా స్పందించింది.ఆలయ ప్రతిష్ఠకు ఇలా మచ్చ తెచ్చిన వారెవరో కనుక్కో వాలని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులకు సూచించింది. దీనిపై పలువురు రాజకీయ నేతలూ స్పందించారు. గతేడాది కూడా టోర్నటో ప్రాంతంలోని కొన్ని హిందూ ఆలయాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఇప్పటికే ఆరు ఆలయాల్లో ఇలాంటివి జరగ్గా... కొన్ని చోట్ల హుండీలను దొంగిలించారు. గతేడాది నవంబర్‌లో హిందూ సభ టెంపుల్, శ్రీ జగన్నాథ్ టెంపుల్‌పై ఇలాంటి దాడే జరిగింది. ఆ తరవాత ఈ ఏడాది జనవరిలో మా చింత్‌పూర్ణి మందిర్, హిందూ హెరిటేజ్ సెంటర్, గౌరీ శంకర్ మందిర్, హామిల్టన్ సమాజ్ టెంపుల్స్ కూడా దాడికి గురయ్యాయి.