నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కొక్కరూ ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. నేడు మాజీ మంత్రి గీతారెడ్డి వంతు వచ్చింది. ఆమె నేడు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అప్పట్లో యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతా రెడ్డితోపాటు గాలి అనిల్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారణ చేసింది.
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ నేతలు ఈడీ నోటీసులు అందుకున్నారు. వారిలో తెలంగాన నేతలు సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, అనిల్ కుమార్ ఉన్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.
సెప్టెంబర్ 23న నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రులు గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు, మాజీ ఎంపీ అంజన్ యాదవ్, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి కూడా నోటీసులు జారీచేసింది. వీరిని ఒక్కొక్కరుగా ఈడీ విచారణ చేస్తోంది. అక్టోబర్ 4న (మంగళవారం) కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ఎదుటకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు. ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారణ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గాంధీలను ఈడీ ప్రశ్నించింది. మొదట్లో రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారణ చేసి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచింది. అయితే, ఆ ఇద్దరి నుంచి ఒకే రకమైన సమాధానాలు రావడంతో మూడో రౌండ్ విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు 6 గంటల పాటు సోనియాను ప్రశ్నించింది.
జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్ గాంధీని ఈడీ 30 గంటలకు పైగా విచారణ చేసింది. వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. జూన్ 16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్ అభ్యర్థన మేరకు ఈడీ ఒకరోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియా గాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో రాహుల్ విచారణ వాయిదా వేసింది.
ఈ కేసులో సోనియాను కూడా జూన్ 23న ఈడీ విచారణకు పిలిచింది. యంగ్ ఇండియన్, ఏజేఎల్, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో రాహుల్ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి. సోనియా గాంధీని మూడు రోజులపాటు రోజుకు మూడు గంటల పాటు ఈడీ ప్రశ్నించింది.