Chiranjeevi Dattatreya: అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిని సన్మానించాలని అనుకుంటున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. అందు కోసం మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు వచ్చానని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ చిరంజీవి వ్యక్తిత్వం, ఆయన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా రోజు విడుదల అయిన ఆయన చిత్రం గాడ్ ఫాదర్ మంచి హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. గొప్ప విలువలు ఉన్న నటుడిగా చిరంజీవికి ప్రత్యేక పేరు ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. గురువారం జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించడానికి వచ్చానని దత్తాత్రేయ తెలిపరు. చిరంజీవి మాట్లాడుతూ.. అలయ్ బలయ్ లాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలిపారు.  గవర్నర్ దత్తాత్రేయ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని చిరంజీవి తెలిపారు. 






ముఖ్య అతిథిగా చిరంజీవి..


అలయ్ బలయ్ కార్యక్రమంలో హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనుంది. అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతారని అలయ్ బలయ్ కమిటీ ఛైర్మన్ విజయ లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. అలయ్ బలయ్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నాయకులు, ప్రముఖులు, ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు అలయ్ బలయ్ కమిటీ ఛైర్మన్ విజయ లక్ష్మి తెలిపారు. అలాగే అలయ్ బలయ్ కార్యక్రమంలో క్రీడా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులను ఘనంగా సత్కరించనున్నారు. ఆయా రంగాలకు చెందిన వారికి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు.  


వివిధ రంగాలకు చెందిన వారికి సత్కారం


తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని 17 సంవత్సరాల నుండి బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది దసరా తర్వాత అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ, సాహిత్య, క్రీడలు సహా ఇతర రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తారు. 


రాజకీయ ప్రముఖుల హాజరు


ఈ సారి అలయ్ బలయ్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు.