IPL 2025 GT Climbs Top Place In Points Table: టా ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. వరసగా రెండోసారి ముంబైపై గెలిచింది. వర్షం కారణంగా చాలా ఉత్కంఠ భరితంగా ముంబై వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్లతో జీటీ గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ ఓ మాదిరి స్కోరుకే ప‌రిమిత‌మైంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ విల్ జాక్స్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. సాయికిశోర్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం వర్షం కారణంగా మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించగా.. ఛేద‌న‌లో జీటీ 19 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 147 ప‌రుగులు చేసింది. శుభమాన్ గిల్ (46 బంతుల్లో 43, 3 ఫోర్లు, 1 సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జస్ ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి, రెండు వికెట్లు తీశాడు. 

క‌ఠినంగా బ్యాటింగ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ముంబైకి ఏదీ క‌లిసి రాలేదు. పిచ్ బ్యాటింగ్ కు క‌ఠినంగా ఉండ‌టంతో ప‌రుగుల రాక క‌ష్ట‌మైంది. ఓపెన‌ర్లు ర్యాన్ రికెల్ట‌న్ (2), రోహిత్ శ‌ర్మ (7) త్వ‌ర‌గా వెనుదిర‌గ‌డంతో 26 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో జాక్స్ త‌న క్లాస్ చూపించాడు. ప్రారంభంలో సూర్య కుమార్ యాద‌వ్ (35) తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వీరిద్ద‌రూ ఇన్నింగ్స్ పున‌ర్మించ‌డంతో ముంబై కోలుకుంది. వీరిద్ద‌రూ వేగంగా స్ట్రైక్ రొటేట్ చేయ‌డంతో పాటు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాదారు. మూడో వికెట్ కు 61 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన త‌ర్వాత సూర్య ఔట‌య్యాడు. ఈక్ర‌మంలో టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసినందుకుగాను ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. మ‌ధ్య‌లో మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మైనా, కార్బిన్ బాష్ (27) అండ‌గా నిల‌వ‌డంతో ముంబై స‌వాలు విస‌ర‌గ‌లిగే స్కోరును సాధించింది. ఈక్ర‌మంలో 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆఖ‌ర్లో బంతి హెల్మెట్ కు త‌గ‌ల‌డంతో బాష్ కంక‌ష‌న్ ఔట్ కాగా, అత‌ని స్థానంలో స‌బ్ స్టిట్యూట్ గా అశ్వ‌నీ కుమార్ బ‌రిలోకి దిగాడు. 

అద్భుత భాగ‌స్వామ్యం.. ఓ మాదిరి టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఇన్నింగ్స్ ను ఆది నుంచి వ‌ర‌ణుడు వెంటాడాడు. ప‌లుమార్లు వర్షం పడటంతో చికాకు క‌లిగింది. ఇక ఛేజింగ్ ఆరంభంలోనే సూప‌ర్ ఫామ్ లో ఉన్న సాయి సుద‌ర్శ‌న్ (5) ఔట‌వ‌గా, ఈ ద‌శ‌లో జోస్ బ‌ట్ల‌ర్ (30) తో క‌లిసి గిల్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వర్షంతో డీఎల్ఎస్ టార్గెట్ ను అనుస‌రిస్తూ బ్యాటింగ్ చేసిన వీరిద్ద‌రూ, వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాదారు. ఈక్ర‌మంలో రెండో వికెట్ కు 72 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యం న‌మోదైన త‌ర్వాత బట్ల‌ర్ ఔట‌య్యాడు. అంత‌కుముందే గిల్.. త‌న‌కు ల‌భించిన లైఫ్ ను స‌ద్వినియోగం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత షేర్ఫేన్ రూథ‌ర్ ఫ‌ర్డ్ (28) వేగంగా ఆడాడు. దీంతో గుజ‌రాత్ పై ఉన్న ఒత్తిడి తొల‌గించాడు. అయితే మధ్యలో వర్షం రావడంతో అర్ద గంటకుపైగా ఆటకు ఆటంకం కలిగింది. వర్షం తగ్గాక ఆట మొదలు కాగా, ముంబై బౌలర్లు పట్టు బిగించి, వరుసగా గిల్, రూథర్ ఫర్డ్, షారూఖ్ ఖాన్ (6) వికెట్లను తీశారు. ఇందులో బుమ్రానే రెండు వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. ఈ స్థితిలో మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. చివరి ఓవర్లో 15 పరుగుల టార్గెట్ ను జీటీకి నిర్దేశించారు. ఆఖరి ఓవర్ ను దీపక్ చాహర్ బౌలింగ్ వేయగా.. ఒక వికెట్ కోల్పోయిన జీటీ.. ఒక ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు సాధించి, జీటీ విజయం సాధించింది. ఇక మిగతా బౌలర్లలో అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్ కు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ ఫలితంలో ముంబై ఆరు వరుస విజయాలకు తెరపడింది. జీటీ 16 పాయింట్లతో టాప్ ప్లేస్ కు చేరుకుంది.