Gavaskar Vs MS Dhoni: గతేడాది ఐపీఎల్ మెగా వేలానికి ముందు తీసుకొచ్చిన అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్ ను దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ విమర్శించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసమే బీసీసీఐ ఈ రూల్ తీసుకొచ్చిందని మండిపడ్డాడు. ఈ రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ వరుసగా ఐదేళ్లు ఆడని ప్లేయర్లని అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో రిటైన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆటగాళ్లకు గరిష్టంగా రూ.4 కోట్ల వరకు చెల్లించవచ్చు. ముఖ్యంగా ఈ రూల్ ద్వారా చెన్నై జట్టు బాగా లాభపడింది. ధోనీ లాంటి ఆటగాడిని కేవలం రూ.4 కోట్లకే దక్కించుకుంది. అతని కోసమే ఇలాంటి రూల్ ను రూపొందించారా.? అని చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సందీప్ శర్మను కూడా అన్ క్యాప్డ్ ప్లేయర్ హోదాలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది. ఇలా 12 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకోగా.. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడి లాభపడిన ఐదారుగురు క్రికెటర్లు ఉన్నారు.
మితీమిరిన డబ్బుతో..ఐపీఎల్లో యువ ఆటగాళ్లకు అందించే ప్రైజ్ మనీపై ఆంక్షలు ఉండాల్సిన అవసరముందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వేలంలో అంచనాలకు మించి, కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన ప్లేయర్లు తర్వాత ఆటలో ఘోరంగా విఫలమయ్యారని గుర్తు చేశాడు. ఇలా పెద్దమొత్తంలో వచ్చిన అమౌంట్ ఆటగాళ్ల ఏకాగ్రతను, ఆటపై చిత్తశుద్ధిని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లలో ఆడాలన్న కసిని, చంపేస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా ఐపీఎల్ యాజమాన్యం దీనిపై దృష్టి సారించాలని పేర్కొన్నాడు.
ప్రైస్ ప్రెషర్.. ఇక గతేడాది మెగా వేలంలో కోట్లాది రూపాయల ధరతో ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. రూ.27 కోట్లతో రిషభ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. 18 ఏళ్ల లీగ్ చరిత్రలో తనే అత్యంత ఖరీదైన ప్లేయర్ కావడం విశేషం. అయితే తనకు పెట్టిన ధరకు అనుగుణంగా పంత్ రాణించలేక పోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. దీని వల్ల ప్లే ఆఫ్ ఎలిమినేషన్ అంచున లక్నో నిలిచింది. ఇక పంత్ మాదిరిగానే అంచానాలకు మించి కనకవర్షం కురిసిన కొంతమంది ఆటగాళ్లు తుస్సుమన్నారు. కనీసం రంజీ మ్యాచ్ లు కూడా ఆడని ఆటగాళ్లపై డబ్బులు కుమ్మరించడంతో, అందులో కొంతమంది ఘోరంగా విఫలమై నిరాశ పరుస్తున్నారు. ఐపీఎల్లో ధన ప్రవాహంతోనే ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని గావస్కర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మున్ముందు ఐపీఎల్ యాజమాన్యం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.