KCR AP Challenge : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి చీఫ్ అయ్యారు. ఈ హోదాలో ఆయన దేశంలో ఇతర రాష్ట్రాల్లో తనను తాను తొలి పరిచయం చేసుకోవచ్చు. తాను అక్కడి వారికి ఫ్రెష్ లీడర్‌గా .. కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధ్యం కాదు. ఇక్కడ ఆయనకు చాలా బ్యాక్ ల్యాగ్స్ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వ్యవహరించడమే కాదు.. తెలంగాణ ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని విడదీశారు. సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యమ సమయంలో ఆయన చేసిన విమర్శల దగ్గర్నుంచి విభజన సమస్యల వరకూ చాలా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఏపీలోనూ బీఆర్ఎస్‌ను విస్తరించాలంటే వాటిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిఉంటుంది. అందుకే కేసీఆర్ మొదటగా ఏ రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకున్నా..కేసీఆర్ కు మాత్రం మొదటి.. అతి క్లిష్టమైన సవాల్ ఏపీనే కానుంది.
ఏపీలో భారతీయ రాష్ట్ర సమితికి అంచనాలకు అందరని సవాళ్లు !
కేసీఆర్ ఇంట గెలిచి రచ్చ గెలవాల్సి ఉంటుంది. జాతీయ స్థాయికి కేసీఆర్ వెళ్లిపోయారు కాబట్టి ఇల్లు అంటే తెలంగాణ మాత్రమే కాదు ఏపీ కూడా అవుతుంది. ఎందుకంటే ఏపీ కూడా తెలుగు ప్రజలు మాట్లాడే రాష్ట్రమే.మరి ఏపీలో కేసీఆర్ ఎలా గెలుస్తారు ?. భారతీయ రాష్ట్ర సమితి పేరు కొత్తగా ఉన్నా.. ఇది టీఆర్ఎస్‌కు మరో రూపం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర హోదా సాధనలో ఆంధ్రులను బూచిగా చూపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశారన్న విమర్శలు సహజంగానే ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు .. కేంద్రంగా సాగిన ఉద్యమంలో ఈ మూడింటిని ఆంధ్రోళ్లు దోచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆ క్రమంలో ఆయన పరిధి దాటి చేసిన విమర్శలు ఎన్నో ఉన్నాయి.
ఉద్యమ సమయంలో ఆంధ్రులపై చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తారా ?
కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన చేయబోతున్నారని ఏపీలో బహిరంగసభ పెడతారన్న ప్రచారం జరగగానే.. గతంలో ఆంధ్రుల్ని కేసీఆర్ విమర్శించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఉద్యమ సమయంలో ఆంధ్రా నేతలంటూ తెలంగాణలో దాడులకు పాల్పడిన వీడియోలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి. గుళ్లూ , గోపురాలూ.. పెళ్లి పేరంటాలకు వస్తే స్వాగతం చెబుతాం కానీ.. ఉద్యమం పేరుతో తమను కించ పరిచి ఇప్పుడు రాజకీయం కోసం వస్తే ఎలా ఊరుకుంటామని సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు ప్రారంభించారు. ఎవరు అవునన్నా కాదన్నా.. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయనకు ఇబ్బందికరమే. వాటిపై విచారం వ్యక్తం చేయడమో లేకపోతే మరో విధంగా కన్విన్స్ చేయడమో చేయగలగాలి. అలా వదిలేసి వెళ్లిపోవడం సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయాలంటే ముందుగా ఇలాంటి అంశాలపై క్లారిటీ ఇవ్వాలి.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యల విషయంలో స్టాండ్ ఏమిటో చెప్పాలి ?
రాష్ట్ర విభజన జరిగిందనే కానీ.. రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒక్క సమస్యా పరిష్కారం కాకకపోగా కొత్త కొత్త సమస్యలు తెరపైకి వచ్చాయి. జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ వచ్చినప్పుడు బేసిన్లు భేషజాలు లేవని ప్రకటించారు.. కానీ అదంతా మాటలే. ఇప్పుడు జల వివాదాలు రెట్టింపయ్యాయి. కృష్ణా, గోదావరి బోర్డుల పంచాయతీ తేలడం లేదు. అక్రమ ప్రాజెక్టుల పేరుతో రెండు రాష్ట్రాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇక పోలవరం ముంపు మండలాలు కావాలని.. పోలవరం డిజైన్ మార్చాలని టీఆర్ఎస్ డిసైడ్ చేస్తోంది. ఆ విషయంపైనా చెప్పాలి. ఇక ఉమ్మడి ఆస్తుల విభజన దగ్గర్నుంచి సవాలక్ష సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. వీటన్నింటిపై కేసీఆర్ తమ భారత్ రాష్ట్ర సమితి విధానాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వీటిలో బ్యాలెన్స్ చూపించకపోతే... రెండు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుంది.
ఏపీ సమస్యలపై ఎలా వ్యవహరిస్తారో చెప్పాల్సి ఉంటుంది !
బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబట్టి ఏపీ సమస్యలపై ఎలా వ్యవహరిస్తారో కూడా చెప్పాల్సి ఉంటుంది. హైకోర్టు వరకూ అమరావతికే అనుకూలంగా ఉన్నా మూడు రాజధాలనుంటున్న వైసీపీ ప్రభుత్వ వాదనను సమర్థిస్తారా ? లేకపోతే అమరావతికే మద్దతిస్తారా అనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. కేంద్ర నిధులు.. ప్రత్యేకహోదా అంశంపైనా సష్టం చేయాలి . ఎలా చూసినా సీఎం కేసీఆర్‌కు ఏపీలో తమ పార్టీ విధివిధానాల్ని ప్రకటించి.. ప్రజల మద్దతు కోసం ప్రయత్నించడం అంత సులువు కాదు. ఈ టాస్క్ చాలా క్లిష్టమైనది.