తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటనకు ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ప్రముఖ దళిత నేత, ఎంపీ, విసికె అధినేత తిరుమావళవన్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కి శుభాకాంక్షలు చెప్పారు. తనను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది తనకు ప్రత్యేకమైన మరిచిపోలేని రోజని తెలిపారు. టిఆర్ఎస్... బిఆర్ఎస్‌గా మారిందని ఇది కేవలం పేరు మార్పు కాదన్నారు. టి నుంచి బి కి జరిగే పరిణామ క్రమమని అభివర్ణించారు. టి అంటే టార్చ్ అని బి అంటే బ్రైట్ అని వివరించారు. బీఆర్‌ఎస్‌తు అద్భుతమైన భవిష్యత్ ఉందన్నారు.
కెసిఆర్ పూర్తిగా ప్రత్యేకతలు కలిగిన నాయకుడని అభివర్ణించారు తిరుమావళవన్. ఆయన ఆలోచనలు, పని విధానం, పోరాటాలు, విజయాలు, అన్నీ కూడా దేనికవే ప్రత్యేకతను కలిగిఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కీర్తించారు. ఇప్పుడు భారత దేశ ప్రజల కోసం ముందడుగు వేస్తున్నారన్నారు. విసికే పార్టీ తరఫున శుభాభినందనలు తెలుపారు.
కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్నారు తిరుమావళవన్. ఈ దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం గిరిజనుల కోసం రైతుల కోసం ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. దళిత బంధు, రైతు బంధు ఈ రెండు స్కీంలు కూడా విప్లవాత్మకమైన పథకాలుగా తెలిపారు. సిఎం కెసిఆర్ బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారని వివరించారు. దళితులు రైతులు గిరిజనులు వీల్లే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చేశారన్నారు. సిఎం కెసిఆర్ దార్శనికత కలిగిన నాయకుడని.... పార్టీ పేరును పరిణామం చేయడం అనే నిర్ణయం సరైన సమయంలో తీసుకున్న సమయ స్పూర్తితో కూడిన నిర్మయంగా చెప్పారు. సిఎం కెసిఆర్ తెలంగాణను సాధించినట్టే భారత దేశ అభివృద్ధిని కూడా సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వీసీకే పార్టీ తరఫున సందేశాన్ని చదివి వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సాధికారత కోసం పాటు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం గొప్ప విషయం అందుకు అభినందనలు. ఇదే స్పూర్తితో భారత పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం. తెలంగాణలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సిఎం కేసీఆర్‌కి కృతజ్జతలు.
రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, విప్లవాత్మక కార్యాచరణతో కూడిన పథకాలను సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. అందుకు కేసీఆర్‌కు కృతజ్జతలు తెలుపుతున్నాం.
నిజంగా సిఎం కెసిఆర్ దార్శనికత కలిగిన నాయకుడు. రానున్న కాలంలో బిజెపి ఓటమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలి. మత విధ్వేషాలను రెచ్చగొడుతూ, దేశంలో విచ్చిన్నతకు కారణమౌతున్న బిజెపి విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. అందుకు అందరం కలిసి పని చేద్దాం అని సందేశాన్ని ముగించారు తిరుమావళవన్.