కొత్తగా ఏర్పడిన భారత్ రాష్ట్రీయసమితిపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. 2001 నుంచి 2022 వరకు కేసీఆర్ తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతమయ్యారని విమర్శించారు. అందుకే ఇప్పుడు మరింత విస్తృతమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టు కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని గ్రహించే ఈ జాతీయ పార్టీ పాటపాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అనే పదం జాతీయ స్థాయిలో వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.
కుటుంబ తగాదాల పరిష్కారంతోపాటు రాజకీయ దురాశతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని... అలాంటి పదం చంపేయాలనుకున్న హంతకుడని కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్‌లో వికృత ఆలోచనలకు ఇది పరాకాష్టగా అభివర్ణించారు.
తెలంగాణ అస్థిత్వాన్ని చంపేసిన కీసీఆర్ ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా అర్హత లేదన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించుకోవాలన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆరెస్ తెరపైకి తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు.
ఇది అయిపోయిన తర్వాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ నుంచి తెలంగాణ నుంచి విముక్తి లబించాలని దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. తాను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుటామన్నారు.