AIADMK Leadership Tussle:
లీగల్ ఫైట్..
AIDMK నాయకత్వం విషయంలో కొన్ని నెలలుగా కొట్లాట కొనసాగుతూనే ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామి పన్నీర్ సెల్వంకు లీగల్ నోటీసులు పంపారు. "పన్నీర్ సెల్వంకు AIDMK పార్టీ పేరు కానీ, గుర్తు కానీ వినియోగించుకునే హక్కు లేదు. ఆఫీస్ అడ్రెస్‌ని కూడా ఎక్కడా వాడకూడదు. ఆ అధికారం ప్రస్తుత పార్టీ జనరల్ సెక్రటరీకి మాత్రమే ఉంటుంది" అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీకి బయటి వ్యక్తిగా ఉన్న పన్నీర్‌సెల్వంకు పార్టీ గుర్తుని, పేరుని వాడుకునే హక్కు ఉండదని తేల్చి చెప్పింది AIDMK. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే "ఫోర్జరీ" నేరంగా పరిగణించాల్సి ఉంటుందని వెల్లడించింది. పార్టీ హెడ్‌క్వార్టర్స్ విషయంలో ఇచ్చిన ఇల్లీగల్ నోటీస్‌ను విత్‌డ్రా చేసుకోవాలని
AIDMK..పన్నీర్ సెల్వంకు రాసిన లేఖలో ప్రస్తావించింది. ఒకవేళ విత్‌డ్రా చేసుకోకపోతే...లీగల్‌గానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పళనిస్వామి అన్ని జిల్లా సెక్రటరీలతో సమావేశమైన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి...అంతకు ముందు పార్టీ జనరల్ సెక్రటరీగా పన్నీర్ సెల్వం వ్యవహరించారు. అయితే...ఈ ఏడాది జులైలో జరిగిన సమావేశంలో...ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో పళనిస్వామి ఆ బాధ్యతలు తీసుకున్నారు.
నెలలుగా పోరాటం..
తమిళనాడులో పనీర్ సెల్వం, పళనిస్వామి మధ్య యుద్ధం ఆగటం లేదు. రెండు, మూడు నెలలుగా ఇది కొనసాగుతూనే ఉంది. AIDMK జనరల్ సెక్రటరీ పదవిపై చెలరేగిన వివాదం ముదిరి చివరకు కోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్ట్ మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పార్టీ నాయకత్వ వివాదంపై అన్నాడీఎంకే లీడర్ పళనిస్వామి కోర్టులో అప్పీల్ వేయగా...దీన్ని కోర్టు అనుమతించింది. అంతకు ముందు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. జులై 11న జరిగిన AIDMK జనరల్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పుని...జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ తోసి పుచ్చింది. ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో...అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు పళనిస్వామికే అందనున్నాయి. మొత్తానికి...మాజీ డిప్యుటీ సీఎం పనీర్ సెల్వంకు షాక్ తగిలింది. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలని నిర్ణయించడంతో ఎక్కువ మంది పళనిస్వామి
వైపే మొగ్గు చూపారు. దీంతో రెండు నెలల క్రితం ఓ సమావేశం మధ్యలోనే పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో వాకౌట్ చేశారు. అయితే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపునకు నీళ్ల సీసాలు విసిరారు.