Mr Beast Wants to Become Twitter CEO: ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూట్యూబ‌ర్‌ అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్స్. అయితే జిమ్మీ డొనాల్డ్స్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. మిస్టర్ బీస్ట్‌ అంటే మాత్రం గుర్తొస్తాడు. మిస్టర్ బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్ యూట్యూబ్‌ ఛానెల్‌కు దాదాపు 112 మిలియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. మన లెక్కల్లో చెప్పుకుంటే, 11 కోట్లకు పైగా స‌బ్‌స్క్రైబ‌ర్స్ అతని బీస్ట్‌ యూట్యూబ్ ఛానెల్‌ని స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇతనికి ట్విట్టర్‌లో (Twitter) కూడా 16 మిలియన్లకు పైగా (ఒక కోటీ 60 లక్షలకు పైగా) సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 


ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధుడైన ఈ యూట్యూబర్, ట్విట్టర్ CEO కావాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. 






 


ఇటీవలే, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ఒక పోల్ నిర్వహించారు. ట్విట్టర్ CEO పదవి తాను కొనసాగాలా లేక పదవి నుంచి దిగిపోవాలా అని ట్విట్టర్‌ యూజర్లను అడిగారు. ఈ పోల్‌లో 1.7 మిలియన్ల మంది పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ యూజర్లు (57.5 శాతం మంది) పదవీ విరమణ చేయమని మస్క్‌కు సలహా ఇచ్చారు. ఆ పోల్‌లో మెజారిటీ ప్రజలు చెప్పిన విధంగా తాను నడుచుకుంటానని పోల్‌కు ముందే ఎలాన్ మస్క్ చెప్పారు. పోల్‌ తర్వాత కూడా దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు. ట్విట్టర్‌ను నడపడానికి 'సరైన మూర్ఖుడు' దొరికిన రోజు, CEO పదవిని తాను వదిలేస్తానంటూ ట్వీట్‌ చేశారు. సాఫ్ట్‌వేర్, సర్వర్ బృందాలను మాత్రమే తాను ఆపరేట్ చేస్తానని ఆ ట్వీట్‌లో వివరించారు. అప్పటి నుంచి, ఎలాన్ మస్క్‌ త్వరలో ట్విట్టర్ CEO పదవిని విడిచిపెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్‌ కొత్త CEO కోసం ఎలాన్‌ మస్క్‌ వెదుకుతున్నారంటూ CNBC కూడా రిపోర్ట్‌ చేసింది.


మిస్టర్ బీస్ట్ కోరికకు ఎలాన్‌ మస్క్‌ సమాధానం ఇది
ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబర్‌గా రికార్ట్‌ సృష్టించిన  మిస్టర్ బీస్ట్‌, తాను ట్విట్టర్ CEO కాగలనా అంటూ ఒక ట్వీట్‌ ద్వారా అడిగాడు. ట్విట్టర్ యజమాని మస్క్ ఈ ప్రశ్నకు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.  అది అర్ధవంతమైన ప్రశ్న కాదు అన్న అర్ధం వచ్చేలా ఎలాన్‌ మస్క్‌ రిప్లై ఇచ్చారు. అంటే, మిస్టర్‌ బీస్ట్‌ సరైన మూర్ఖుడు కాదని మస్క్‌ మామ అనుకుంటున్నారా?.


ఎలాన్ మస్క్ ఇప్పుడు నంబర్‌ 2
ట్విట్టర్‌ కొంటానని ఈ ఏడాది (2022) ఏప్రిల్‌లో ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌, అక్టోబర్‌లో డీల్‌ పూర్తి చేశారు. ట్విట్టర్‌ కోసం, ఈ ఏడాదిలో నాలుగు సార్లు టెస్లా షేర్లను అమ్మేశారు. టెస్లా షేర్ల విక్రయం రూపంలో సంపద హరించుకుపోవడంతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కిరీటాన్ని ఎలాన్‌ మస్క్‌ కోల్పోయారు. బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో 1వ స్థానం నుంచి 2వ స్థానానికి దిగి వచ్చారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత్యంత ధనవంతుడిగా తొలి స్థానంలో ఉన్నారు. భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ 132.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో 3వ స్థానంలో ఉన్నారు.