ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా,మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని సీఎం కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
కైకాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి - సీఎం జగన్
‘‘గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
కైకాల మరణం విచారకరం - చంద్రబాబు
‘‘సత్యనారాయణగారి మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరసనటనాసార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
నారా లోకేశ్ ట్వీట్
‘‘సీనియర్ నటులు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మృతి విచారకరం. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని నారా లోకేశ్ సంతాపం తెలిపారు.
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నవరస నటసార్వభౌముడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.