అగ్నిపథ్ ఆందోళనలతో రైల్వేకి రూ.25కోట్ల నష్టం..! 


దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ పథకంపై ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే అంతటా ఓ కామన్ పాయింట్ మాత్రం కనిపిస్తోంది. ఆర్మీ అభ్యర్థులు అన్ని చోట్లా రైల్వే స్టేషన్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. బిహార్‌, పశ్చిమబంగ, తెలంగాణ..ఇలా ఎక్కడ చూసినా ఈ ఆందోళనల కారణంగా ఎక్కువగా నష్టపోయింది రైల్వేనే. బిహార్‌లో మూడు రైళ్ల బోగీలు ధ్వంసం చేశారు. స్టేషనరీ ట్రైన్‌ కూడా ధ్వంసమైంది. సికింద్రాబాద్‌లో 
మూడు రైళ్లను పూర్తిగా కాల్చివేశారు. ఇప్పటి వరకూ జరిగిన ఆందోళనల కారణంగా 612 రైళ్లు ప్రభావితమవగా, 602 రైళ్లు రద్దయ్యాయి. మరో 10 రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. ఈ మొత్తం నిరసనలతో రైల్వేకి దాదాపు రూ.25కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. 


రైల్వే స్టేషన్లే ఎందుకు టార్గెట్..? 


రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని ఆందోళనలు చేయటం ఇదే తొలిసారి కాదు. 168ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మందిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. అన్ని ప్రాంతాలకూ విస్తరించి ఉండటం వల్ల, ఎప్పుడు అసంతృప్తి కలిగినా రైళ్లను ధ్వంసం చేయటం ద్వారా తమ అసహనాన్ని తీర్చుకుంటున్నారు నిరసనకారులు. నేరుగా రైల్వే స్టేషన్‌కే వెళ్లి అలజడి సృష్టిస్తున్నారు. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ భారత్‌ సొంతం. దేశవ్యాప్తంగా దాదాపు 64 వేల కిలోమీటర్ల మేర విస్తరించింది ఉంది. 


అధికారులు ఏం చెబుతున్నారంటే..


సుమారు 13 వేల ప్యాసెంజర్‌ ట్రైన్స్‌లో..రోజుకు 2 కోట్ల 30 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర వేస్తోంది రైల్వే నెట్‌వర్క్. ఇంత ప్రాధాన్యత ఉన్న నెట్‌వర్క్‌కు నష్టం కలిగిస్తే ప్రభుత్వం నుంచి తొందరగా స్పందన వస్తుందని భావిస్తారు ఆందోళనకారులు. పైగా రైల్వే స్టేషన్లకు భద్రత చాలా తక్కువగా ఉంటుంది. సులువుగా దాడి చేసేందుకు వీలుండటం వల్ల నిరసనకారులు నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి పట్టాలపై బైఠాయించటం, రైళ్లను తగలబెట్టటం లాంటివి చేస్తుంటారు. రైల్వేలో నష్టం సాధారణంగానే అనిపించినా అది పూర్తి నెట్‌వర్క్‌పై ప్రభావం పడుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఆందోళనలు జరిగిన ప్రతిసారీ ఉన్నతాధికారులు సమావేశమై, ప్రభావాన్నితగ్గించేందుకు ప్రయత్నిస్తారు. అయితే స్టేషన్‌ను బ్లాక్‌ చేస్తే...సర్వీస్‌లు నిలిపివేయాల్సి వస్తుందని, తద్వారా ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు రైల్వే అధికారులు. బిహార్‌లో రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనల వల్ల రూ. 18కోట్ల నష్టం వాటిల్లింది. 


ఇప్పుడే కాదు. సాగు చట్టాల సమయంలోనూ రైతులు రైల్వే స్టేషన్లనే లక్ష్యంగా చేసుకుని నిరసనలు చేపట్టారు. పంజాబ్‌లో రైతుల ఉద్యమం కారణంగా రెండు నెలల పాటు రైళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ విషయమై కేంద్రాని, పంజాబ్ రాష్ట్రానికి మధ్య మాటల యుద్ధం నడిచింది. రూ. 1,200 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రం వెల్లడించింది. 


Also Read: Presidential Election 2022: చీపురు పట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము- Z+ భద్రత కల్పించిన కేంద్రం


Also Read: Jhansi Lakshmi Bhai: ఝాన్సీ లక్ష్మి బాయ్ వీపున మోసిన బిడ్డ ఏమయ్యాడో  తెలుసా ?