Presidential Election 2022: ఎన్‌ఏడీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముకు భద్రత పెంచింది కేంద్రం. ఆమెకు Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ముర్ము భద్రతను సీఆర్‌పీఎఫ్ చూసుకోనుంది.
ఆలయం శుభ్రం
రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం తాను చిన్నప్పటి నుంచి వెళ్తున్న శివాలయానికి వెళ్లారు ద్రౌపది ముర్ము. గుడి అంతా చీపురుతో శుభ్రం చేశారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ ద్రౌపది ముర్ముని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా ప్రకటించింది.
ఎవరీ ద్రౌపది?
ద్రౌపది ముర్ము గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. ఇలా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఇదే తొలిసారి. భాజపా పార్లమెంటరీ కమిటీ భేటీ తర్వాత ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్లుగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ము ఒక టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిత్వం వరకూ ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తి దాయకం. ఇప్పటివరకూ రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించలేదు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యాం చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ చదివారు. ఆ తర్వాత టీచర్‌గా తన కేరీర్‌ను ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పని చేశారు. 1997లో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు.
2015లో గవర్నర్
1997 ఏడాదిలో భాజపాలో చేరిన ద్రౌపది ముర్ము అదే ఏడాదిలో కౌన్సిలర్ అయ్యారు. తర్వాత 2000వ ఏడాదిలో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టర్మ్ లోనే ఆమెను మంత్రి పదవి వరించింది. 2000- 02 వరకూ ఒడిశాలో రవాణా, వాణిజ్య మంత్రి అయ్యారు. బిజు జనతాదళ్ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె పని చేశారు. 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
Also Read: Maharashtra Political Crisis: 'మహా' రాజకీయంలో మరో మలుపు- సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్