Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు తాజాగా కరోనా సోకింది. దీంతో ఠాక్రే ఐసోలేషన్‌లో ఉన్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ పరిశీలకుడు కమల్‌నాథ్ తెలిపారు.






బుధవారం మధ్యాహ్నం కేబినెట్ భేటీకి ఉద్ధవ్ ఠాక్రే హాజరుకావాల్సి ఉంది. అయితే ఈలోపే ఆయనకు కరోనా సోకింది.


గవర్నర్‌కు


మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ కూడా కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం ముంబయికి వెళ్లి మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కావాలని ఏక్‌నాథ్ షిండే వర్గం అనుకుంది. అయితే ఈలోపే గవర్నర్‌కు కరోనా సోకింది.


గువాహటి


మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే సహా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తాజాగా సూరత్ నుంచి గువాహటి (అసోం) చేరుకున్నారు. ఏక్‌నాథ్‌ వెంట మొత్తం 34 మంది శివసేన ఎమ్మెల్యేలు సహా ఏడుగురు స్వతంత్ర శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌లో బస చేసిన ఈ ఎమ్మెల్యేలంతా బుధవారం తెల్లవారుజామున విమానంలో గువాహటి చేరుకున్నారు.


రద్దు చేస్తారా?


మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ రద్దు దిశగా మహారాష్ట్ర సంక్షోభం సాగుతున్నట్లు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అంతకుముందు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.



ఏక్‌నాథ్ షిండే సహా మిగిలిన ఎమ్మెల్యేలతో శివసేన చర్చలు కొనసాగుతున్నాయి. మాది పోరాటం చేసే పార్టీ. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా శివసేన పోరాటం చేస్తుంది. మహా అయితే అధికారం కోల్పోతాం.. కానీ పోరాటం మాత్రం ఆపం.                                                                 "
- సంజయ్ రౌత్, శివసేన ఎంపీ