గిరిజన వర్గానికి ప్రతినిధిగా..


ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటించినప్పటి నుంచి ఎవరీ వ్యక్తి..? భాజపా ఆమెనే ఎందుకు ఎంపిక చేసుకుంది అన్న ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అధిష్ఠానం ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచించి ఆమెను బరిలో నిలిపిందని, విపక్షాలు ఆశలు గల్లంతవటం తప్పదని భాజపా వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఝార్ఖండ్ గవర్నర్‌గా పని చేసిన ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన వారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఝార్ఖండ్‌లో ఆ వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు ద్రౌపది. పైగా ఇప్పుడా రాష్ట్రంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చ-JMM అధికారంలో ఉంది. ఇది యూపీఏకి మిత్ర పక్షం. ఇక్కడ కీలకంగా ప్రస్తావించాల్సిన అంశమొకటి ఉంది. 


ఇరకాటంలో పడిపోయిన జేఎమ్‌ఎమ్‌


ప్రతిపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపనున్నారు. ఆయనకు JMM మద్దతునిస్తోంది. అయితే ఇదే రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపటం ద్వారా భాజపా, జేఎమ్‌ఎమ్‌ని ఇరకాటంలోకి నెట్టింది. అటు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతునిచ్చినా, సొంత రాష్ట్ర నేతకూ మద్దతునివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయి ఝార్ఖండ్ ముక్తి మోర్చ. 2017లో ఝార్ఖండ్‌లో భాజపా ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో కౌలు చట్టాల్లో పలు మార్పులు చేసేందుకు ప్రయత్నించింది. ఈ సవరణలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పటికే గవర్నర్‌ పదవిలో ఉన్న ద్రౌపది ముర్ము..ఈ సవరణలకు సంబంధించిన బిల్స్‌ని ఆమోదించకుండా వెనక్కి పంపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజల్లో ఆమెకు ఆదరణ ఇంకా పెరిగింది. ఆ తరవాతి ఎన్నికల్లో ఝార్ఝండ్ ముక్తి మోర్చ అధికారంలోకి వచ్చింది. అయితే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా...భాజపా మరోసారి ఝార్ఖండ్‌లో పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని బరిలో నిలబెట్టింది. 


ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసేందుకేనా..? 


ఈ లెక్కలన్నీ వేసుకున్న తరవాతే ఆమెను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే..గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. గుజరాత్‌లో 14% గిరిజన జనాభా ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాదు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భాజపా బలం పెంచుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ మద్దతు కూడగట్టవచ్చని ప్లాన్ చేసింది భాజపా. ఇదన్నమాట అసలు సంగతి.