Delhi police arrest lady don Zikra : ఢిల్లీలోని సీలంపూర్‌లో 17 ఏళ్ల కునాల్ అనే యువకుడి హత్య కేసులో లేడీ డాన్ జిక్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉంది. ఏప్రిల్ 17 సాయంత్రం కునాల్ ను అత్యంత దారుణంగా పొడిచి చంపిన ఘటన కలకల రేపింది. లేడీ డాన్ జిక్రా, ఆమె సోదరుడు సాహిల్, షోయబ్-మస్తాన్ ముఠాకు చెందిన ఇతర సభ్యులు చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. కునాల్‌పై జిక్రా , ఆమె సోదరుడు సాహిల్‌కు పాత కక్షలు ఉన్నాయని ఈ హత్యకు అదే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.
లేడీ డాన్ జిక్రా ఈశాన్య ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఆమె గతంలో గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయా వద్ద బౌన్సర్‌గా పనిచేసింది. హషీమ్ బాబా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ భార్య వద్ద బౌన్సర్ గా చేసి.. రౌడీ గ్యాంగ్ ఎలా నడపాలో నేర్చుకున్న జిక్రా.. తన సోదరుడు సాహిల్‌తో కలిసి సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ గ్యాంగ్‌లో కొంతమంది యువకులు కూడా చేర్చుకున్నారు. జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన హ్యాండిల్‌లో "లేడీ డాన్" అని పేర్కొంది. తుపాకీలతో రీల్స్ చేస్తూ డాన్స్ వీడియోలను పోస్ట్ చేసేది. గతంలో ఆయుధాలతో సంబంధం ఉన్న కేసులో జైలుకు వెళ్లింది.
ఆమె చేతిపై "లేడీ డాన్" అని టాటూ ఉంటుంది. కొన్ని రోజుల కిందట జిక్రా సోదరుడు సాహిల్‌పై జరిగిన దాడిలో కునాల్ అతని స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో సాహిల్ గాయపడ్డాడు, దీనిపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాతా జిక్రా కునాల్‌ను హత్య చేస్తామని బెదిరించింది. ఈ కక్ష హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కునాల్ హత్యకు గురయిన తర్వాత విచారణ జరిపి జిక్రా ప్రమేయం ఉందని గుర్తించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సోదరుడు సాహిల్ మరియు ఇతర నిందితుల కోసం 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
జిక్రా సమక్షంలోనే కునాల్ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. షోయబ్-మస్తాన్ ముఠాతో సంబంధం ఉన్న ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య తర్వాత సీలంపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మతపరమైన కోణం కూడా ఈ హత్యలో చర్చకు రావడంతో వివాదాస్పదమయింది.