ఝాన్సీ రాణి ..దేశం స్వాతంత్య్ర పోరాటంలో అలవోకగా ప్రాణాలు త్యాగం చేసిన వీర మహిళ. పరాయిపాలనలో బతకడం కంటే స్వేచ్ఛ కోసం జరిగే పోరాటంలో ప్రాణాలు వదలడమే మంచిదని పోరాడారు ఝాన్సీ. ఆమె పేరు ఎత్తగానే..గుర్రంపై స్వారీ చేస్తూ వీపు వెనుక  బిడ్డను కట్టుకున్న ఒక పోరాట యోధురాలి దృశ్యం మన మదిలో మెదులుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఏదో ఒక చోట ఆ విగ్రహం కచ్చితంగా ఉండి తీరుతుంది. ఆనాటి స్వాతంత్య్ర వీరుల్లో అందరికంటే శూరురాలు అంటూ...బ్రిటీష్ వారే ఆమెను కీర్తించారు. యుద్ధంలో ఆమె మరణించిన తరువాత ఆమె వీపున కట్టుకుని యుద్ధం చేసిన ఆమె బిడ్డ ఏమయ్యాడు..? ఈ విషయం చాలామందికి తెలియదు . 


ఆ బిడ్డపేరు .. దామోదర్ రావు :


ఝాన్సీ రాణి,ఆమె భర్త గంగాధర రావు లకు పిల్లలు లేకపోవడం వల్ల తమ బంధువు వాసుదేవ రావు కుమారుడైన ఆనంద రావును దత్తత తీసుకున్నారు. ఆ తరువాత అతని పేరును దామోదర రావు గా మార్చారు. 1849 లో పుట్టిన దామోదర రావు..ఝాన్సీ రాణి యుద్ధంలో ప్రాణాలు వదిలినప్పుడు అందరూ అనుకునేట్టు పసిబిడ్డ కాదు. అప్పటికి అతనికి ఏడెనిమిది ఏళ్ల వాడు. ఈ దత్తత కార్యక్రమం మొత్తం బ్రిటీష్ అధికారుల సమక్షంలోనే  జరిగింది. అప్పటికే ఆరోగ్యం పాడైన గంగాధర రావు తాను చనిపోతే ఆ తరువాత రాజ్యం తన దత్తత కుమారుడైన దామోదర రావుకే దక్కాలని వీలునామా కూడా రాశారు. బ్రిటీష్ వారు ఆ వీలునామాను గౌరవిస్తామని,గంగాధర రావు తరువాత అతని కుమారుడికి గౌరవం చూపుతామని చెప్పారు. రాణి లక్ష్మీబాయికే రాజ్యంపై అధికారం మొత్తం ఉంటుందని లేఖ కూడా రాశారు. 



మాట నిలుపుకోని  బ్రిటీష్ పాలకులు :



అయితే గంగాధర రావు చనిపోయాక బ్రిటీష్ వారు మాట మార్చారు. అప్పటికి ఇండియాలో  బ్రిటీష్ గవర్నర్ జనరల్ గా ఉన్న లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చిన రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రకారం సరిగ్గా తమ రాజ్యాలని పాలించని రాజుల భూభాగాలను ,పిల్లలులేని రాజ్యాలను బ్రిటీష్ వారు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. అప్పటికే సతారా , సంబాల్ పూర్  లాంటి రాజ్యాలను తమ అధికారంలోకి తీసేసుకున్నారు ఆంగ్లేయులు. తరువాత వారి కన్ను ఝాన్సీపై పడడంతో ఆమె ప్రతిఘటించారు. అదే సమయంలో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం మొదలు కావడంతో ఆమె దానిలో పాల్గొని బ్రిటీషర్ల తో యుద్ధం చేస్తూనే 18 జూన్ 1858 న  ప్రాణాలు వదిలారు . 



ఝాన్సీ రాణి మరణం తరువాత ఆ ఆమె బిడ్డ దామోదర్ రావు ఏమయ్యాడు ?


ఝాన్సీ లక్ష్మి బాయ్  మరణించగానే ఆమె బిడ్డను తీసుకుని నమ్మకస్తులైన అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఝాన్సీ రాణి పరివారంలోని 60 మంది అనుచరులు ,22 ఏనుగులు ,60 ఒంటెలు గల దళం దామోదర రావుతో పాటు అడవుల్లోకి వెళ్లిపోయింది. తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు,నగలు ఒక్కొక్కటి జనావాస ప్రాంతాల్లోకి తెచ్చి అమ్ముతూ, ఆ వచ్చిన డబ్బుతో ఆహారం సమకూర్చుకుంటూ వారు జీవనం సాగించారు. ఎప్పుడూ ఒకే అటవీ ప్రాంతంలో ఉండకుండా ..తమ స్థావరాన్ని మారుస్తూ  బ్రిటీష్ వారికి దొరకకుండా దామోదర రావును కాపాడుకున్నారు వారు. బీతూర్  రాజు రావు సాహెబ్ లాంటి వారి సహాయం కోరినా బ్రిటీష్ వారి భయంతో వారి నుంచి దామోదర్ రావుకు ఎలాంటి సహాయం అందలేదు. చివరికి ఆ సహాయం చేసింది ఇప్పటి  రాజస్థాన్ లోని  ఝల్పటాన్ పాలకుడు రాజా ప్రతాప్ సింహ్. అయన సహకారంతో దామోదర్ రావు సంరక్షుకుడు నానే ఖాన్ బ్రిటీష్ అధికారి ఫ్లింక్ ను కలిసి దామోదర్ రావు కు రక్షణ ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆయన సహకారంతో లొంగిపోయిన  దామోదర్ రావు ను బ్రిటీష్ వారు ఇండోర్ కు పంపించి వేశారు. అప్పటికి ప్రథమ స్వాతంత్య్ర పోరాటం ముగియడం ,ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో సాగించిన దురాగతాలపై బ్రిటన్ లోనే తీవ్ర విమర్శలు రావడంతో వారు దామోదర్ రావుకు ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఇండోర్ లోని పొలిటికల్ ఏజెంట్ సర్ రిచర్డ్ షేక్స్ పియర్ ,దామోదర్ రావుకు మున్షి ధర్మ నారాయణ్ అనే కాశ్మీర్ పండితుణ్ణి టీచర్ గా నియమించారు. ఆయన శిష్యరికంలో మరాఠీ ,ఇంగ్లీష్ ,ఉర్దూ భాషలను నేర్చుకున్న దామోదర్ రావు కు 10,000 రూపాయల భరణాన్ని ఏర్పాటు చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అలాగే తనతో పాటు 7గురు అనుచరులను మాత్రం ఉంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. మిగిలిన వాళ్ళకు క్షమాభిక్ష పెడుతున్నట్టు ప్రకటించి వారిని అక్కడి నుంచి పంపించి వేసింది. ఇండోర్ లోనే స్థిరపడ్డ దామోదర్ రావు పెద్దయ్యాక అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్న దామోదర్ రావు మంచి ఫోటో గ్రాఫర్ గా 
పేరు తెచ్చుకున్నాడు. 28 మే 1906లో 56 ఏళ్ల వయసులో  మరణించిన దామోదర్ రావుకు లక్ష్మణ్  రావు అనే కొడుకు ఉన్నాడు . 



ఇంటిపేరు మార్చుకున్న వారసులు :



అప్పటి వరకూ ఉన్న ఇంటిపేరు నెవాల్కర్‌ను కాదని కొత్తగా ఝాన్సీవాలె అనే పేరును వాడడం మొదలుపెట్టారు దామోదర్ రావు వారసులు.
తాము కోల్పోయిన ఝాన్సీ రాజ్యానికి గుర్తుగా ఆ పేరును తమ ఇంటిపేరుగా పెట్టుకున్నారు. 1904 లో పుట్టిన లక్ష్మణ్ రావు పేదరికంలోనే జీవనం సాగించాడు. ఝాన్సీ రాణి మనువడైన లక్ష్మణ్ రావు ఇండోర్ లో ఒక టైపిస్ట్ గా బ్రతికాడు. స్వాతంత్య్రం వచ్చాక 1957లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటానికి 100 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లక్ష్మణ్ రావును ఆహ్వానించి సత్కారం చేసింది. ఆ తరువాత రెండేళ్లకు 1959లో ఆయన మరణించారు. ఈయనకు క్రిష్ణా రావు ,చంద్రకాంత్ రావు అని ఇద్దరు కొడుకులున్నారు. 2015 లో ప్రభుత్వం ఝాన్సీలో జరిపిన ఝాన్సీ జన్ మహోత్సవ్ కార్యక్రమానికి వారిద్దరి కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి గౌరవించింది .