Congress: రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతోన్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. దీంతో కాంగ్రెస్ అధి నాయకత్వం, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి దిగుతున్నారు. 


మహిళా మార్చ్


2023లో రెండు నెలల పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో 'మహిళా మార్చ్' ప్రారంభమవుతుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆదివారం ప్రకటించారు. 2023 జనవరి 26, నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక పాద‌యాత్ర ప్రారంభ‌ం కానుంది. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఛత్తీస్‌గఢ్ రాజ‌ధాని రాయ్‌పుర్‌లో 85వ ప్లీన‌రీ స‌మావేశాల‌ను మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఆదివారం జ‌రిగిన పార్టీ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.


ఖర్గే వార్నింగ్


మొదటి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ (Congress Steering Committee) సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగత జవాబుదారీతనం పై నుంచి క్షేత్ర స్థాయి వరకు ఉండాలన్నారు. తమ బాధ్యతలను నిర్వర్తించలేని వారు తప్పుకోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో రాబోయే 30 నుంచి 90 రోజుల్లో ప్రజల సమస్యలపై ఉద్యమానికి రోడ్‌ మ్యాప్‌ను సమర్పించాలని ఖర్గే రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కోరినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.



పై నుంచి కింది స్థాయి వరకు సంస్థాగత జవాబుదారీతనం అనేది పార్టీ, దేశం పట్ల మన బాధ్యతలో అతి ముఖ్యమైన భాగం అని నేను నమ్ముతాను. కాంగ్రెస్ బలంగా, జవాబుదారీగా, ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటేనే ఎన్నికల్లో గెలిచి దేశ ప్రజలకు సేవ చేయగలం. కీలక పదవుల్లో ఉన్న కొంత మంది పార్టీలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అలా లేని వారిని పార్టీని కచ్చితంగా విస్మరించాల్సి వస్తుంది.                                 "
-  మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు



అక్టోబర్‌లో అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ ఉన్నతాధికారులు కీలకమైన సంస్థాగత విషయాలను చర్చించడంతో పాటు ప్లీనరీ సమావేశాల షెడ్యూల్, వేదికపై చర్చలు జరుపుతున్నారు. ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైన వెంటనే సీడబ్ల్యూసీ సభ్యులందరినీ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా చేర్చారు.


Also Read: Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు