Telangana Congress Protest: డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన చేపట్టబోతున్నట్లు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు రైతులకు అండగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టబోతున్నట్లు వివరించారు. రైతులు, ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసనలను విజయవంతం చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని, రైతు రుణమాఫీ చేసి, పోడు భూములు అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించాలన్ని అన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


"5 డిసెంబర్ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపులో భాగంగా రైతులకు అండగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తునానం. కరీంనగర్ లోక్ సభకు సంబంధించి కరీంనగర్, సిరిసిల్ల జిల్లా ఈ ధర్నాలో రైతులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ధరణి సమస్యలు పరిష్కరించాలని, రైతు రుణమాఫీ చేయాలని, పోడు భూములు, అసైన్డ్ భూములు పరిష్కరించాలని, ధాన్యం కొనుగోళ్ల అవకతవకలను నిలిపివేయాలని కోరుతూ చేసే ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొనాలి" - పొన్నం ప్రభాకర్






డిసెంబర్ 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీ జన్మదినంతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రకటించిన రోజే డిసెంబర్ 9వ తేదీ అని చెప్పారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజు అని ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పార్టీ సభ్యలకు ఇన్సూరెన్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ కార్డుల పంపిణీకి కార్యాచరణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 9న రక్తదాన శిబిరాన్ని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్ ల వారీగా సమీక్షించి డిసెంబర్ 6వ తేదీ లోపు దాతల పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రక్తదానం చేసినవారికి సర్టిఫికెట్, మెమెంటో అందజేసి గౌరవిద్దామన్నారు. సోనియా జన్మదిన సందర్బంగా వెయ్యి మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల బీమా చెక్కులను అందజేయాలన్నారు. పని విభజన చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నేతలను ఆహ్వానించాలని సూచించారు. 


అలాగే డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ధర్నాల్లో ప్రజలు, కార్యకర్తలు అంతా పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పారదోలేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.