Indian Navy Day 2022:


నావికా దళ దినోత్సవం..


భారత నౌకా దళ దినోత్సవం సందర్భంగా...దేశమంతా నేవీ సేవల్ని స్మరించుకుంటోంది. 1971లో భారత్, పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో "ఆపరేషన్ ట్రిడెంట్" (Operation Trident)తో  విజయం సాధించింది నావికా దళం. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత నౌకా దళ దినోత్సవం (Indian Navy Day) జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖులంతా నేవీ సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేవీపై ప్రశంసల జల్లు కురిపించారు. "దేశానికి కష్టకాలం వచ్చిన ప్రతిసారీ...ఇండియన్ నేవీ ముందుండి ఆ ఆపదను తీర్చింది" అని కొనియాడారు. ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "నేవీ సిబ్బందికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నేవీని చూసి ఇండియా గర్వ పడుతోంది. సవాళ్లు ఎదురైన ప్రతిసారీ దేశాన్ని నావికా దళం ముందుండి కాపాడింది" అని ట్వీట్ చేశారు. కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కూడా నేవీకి శుభాకాంక్షలు తెలిపారు. "ఎంతో ధైర్యవంతమైన మన నేవీకి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. మీ అంకితభావానికి, నిబద్ధతకు మా సెల్యూట్" అని ట్వీట్ చేశారు.






కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ "తీర ప్రాంతాలను రక్షిస్తూ దేశ భద్రతకు భరోసా ఇస్తున్న నేవీకి శుభాకాంక్షలు. మీ నిబద్ధతను, ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది" అని ట్వీట్ చేశారు. ఇండియన్  నేవీ లో మహిళా అగ్నివీరులను నియమిస్తున్నట్టు నౌకాదళం ప్రకటించింది. నేవీ డే సందర్బంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా  ఈ  విషయం తెలిపారు. ఇప్పటీకే  ఈ ప్రక్రియ మొదలైనట్టు ఆయన తెలిపారు.  ఇండియన్ నేవీ లో 3000 మంది వరకూ అగ్నివీర్ లను నియమించే అవకాశం ఉందని వీరిలో 324 మంది మహిళలు ఉంటారని ఆయన అన్నారు. ఇకపై జరిగే నియామకాల్లో 20 శాతం మంది మహిళలను ఎంపిక చేసేలా చూస్తామన్నారు .