Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసును దిల్లీ పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల డిమాండ్ మేరకు ఈ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ రిమాండ్‌ను కోర్టు నాలుగు రోజులు పెంచింది. అఫ్తాబ్‌ గత ఐదు రోజులుగా పోలీసుల రిమాండ్‌లోనే ఉన్నాడు. ఈ సందర్భంగా కోర్టులో అఫ్తాబ్.. ఈ హత్య గురించి మాట్లాడినట్లు సమాచారం.


ఏదో అలా!


శ్రద్ధాను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని, జరిగిన గొడవ వల్ల వచ్చిన కోపంలో ఆ క్షణం, అలా జరిగిపోయిందని అఫ్తాబ్.. కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జరిగిన ఆ ఘటనను గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బందిగా ఉందని అఫ్తాబ్ కోర్టుకు తెలిపాడట. 


శ్రద్ధాను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడ విసిరేశాడు, ఆమె తలను పడేసిన ప్రదేశం గురించి అడిగినప్పుడు అఫ్తాబ్ భిన్నమైన సమాధానాలు చెప్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఇదీ కేసు


అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.


కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అఫ్తాబ్‌పై అనుమానం


తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.


అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.


దర్యాప్తులో


అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. 


Also Read: Shivaji Remarks Row: 'మా దేవుడయ్యా శివాజీ'- రంగంలోకి దిగిన నితిన్ గడ్కరీ!