ఈ-వీసాల ద్వారానే అఫ్గాన్ పౌరులు భారత్ రావాలని హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్ ఇటీవల కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అఫ్గాన్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. ‘
భారత్‌కు వచ్చేందుకు అఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్‌ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టింది. అఫ్గాన్ పౌరులు.. ఈ-వీసాల ద్వారానే భారత్ చేరుకోవాలని తాజాగా హోంశాఖ ప్రకటించింది.
ఇంతకుముందు అఫ్గాన్ పౌరులకు ఇచ్చిన వీసాలన్నీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ-వీసాలపై మాత్రమే వారు భారత్ కు రావాలని తెలిపింది.
భారత్ రావాలనుకునే అఫ్గాన్ పౌరులు ఈ-వీసా కోసం ఇక్కడ www.indianvisaonline.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.
అఫ్గాన్ పరిస్థితులు..
అఫ్గాన్ పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆగస్టు 31 లోపు అమెరికా దళాలు.. అప్గాన్ ను విడిచి వెళ్లాలని తాలిబన్లు ఇప్పటికే బైడెన్ ను హెచ్చరించారు. అమెరికాకు ఇచ్చిన డెడ్‌లైన్‌ను పొడిగించే ప్రసక్తే లేదని తాలిబన్ ప్రతినిధి స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని.. అయితే ఎయిర్ పోర్టులో పరిస్థితి అదుపులోకి రావడం లేదన్నారు. అఫ్గాన్‌కు చెందిన మేధావులు, నిపుణులు సైతం దేశాన్ని వీడటం వల్ల నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు తాలిబన్ నేతలు, సీఐఏ ప్రతినిధులకు మధ్య జరిగిన రహస్య భేటీ గురించి తనకు తెలియదన్నారు.
అయితే బైడెన్ మాత్రం తమ పౌరులు, దళాల తరలింపునకు గడువు పొడిగించాలని యోచిస్తున్నట్లు ఇప్పటికే తెలిపారు. మరోవైపు తాలిబన్లు.. అఫ్గాన్ లో అరాచకాలు సృష్టిస్తున్నారు. పైకి శాంతివచనాలు పలుకుతున్నా మహిళల హక్కులను కాలరాస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. అప్గాన్ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లాలని కాబూల్ ఎయిర్ పోర్ట్ కు భారీగా తరలివెళ్తున్నారు.
Also Read: Afghanistan Taliban Crisis: 'అఫ్గాన్ సంక్షోభాన్ని ముందుగానే ఊహించాం.. కానీ'