హుజురాబాద్ ఉపఎన్నిక చిన్న విషయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం అటు టీఆర్ఎస్‌తో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీల్లోనూ చర్చనీయాంశం అయింది. హుజురాబాద్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో కళ్ల ముందు కనబడుతున్నా కేటీఆర్ తాము పట్టించుకోవడం లేదని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఆలోచిస్తామని చెప్పడం సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్య పరిచింది. కేటీఆర్ అలా ఎందుకు అన్నారనే దానిపై గుసగుసలాడుకుంటున్నారు. 


హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఉపఎన్నికకు ఇంచార్జిగా హరీష్ రావును నియమించారు. అన్ని మండలాలకు ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యతలిచ్చారు. అయినా తాము పట్టించుకోవడం లేదని కేటీఆర్ ప్రకటించడం  ..వెనుకబడ్డామేమో అన్న ఓ భావన వారికి కల్పించింది. అయితే టీఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాలు మాత్రం వరుస విజయాలతో టీఆర్ఎస్ క్యాడర్‌లో నిర్లిప్తత ఏర్పడినట్లుగా హైకమాండ్ గుర్తించిందని..  ఖచ్చితంగా గెలుస్తామని చెబితే... వారిలో మరింత నిర్లక్ష్యం వస్తుందని దుబ్బాక ఉపఎన్నికలో ఓడిపోవడానికి ఆ నిర్లక్ష్యమే కారణని .. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికే హైకమాండ్ వ్యూహాత్మక ప్రకటన చేసిందని అంటున్నారు. కేసీఆర్ కూడా పలుమార్లు సమీక్షా సమావేశాల్లో ఇదే అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ రాలేదన్న కారణంగా కొంత మంది నేతలు ప్రచార కార్యక్రమాల్ని నిలిపివేశారని.. ఇంచార్జులంతా హుజురాబాద్‌లోనే ఉండాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. 
 
 అయితే విపక్ష నేతలు మాత్రం హుజురాబాద్‌లో ఫలితం తేడా వస్తే అది టీఆర్ఎస్‌పై తక్కువ ప్రభావం చూపేలా ఇప్పటి నుండే వ్యూహం అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఫలితం తేడా వస్తే ప్రభుత్వానికేం ఇబ్బంది ఉండదని .. ఇంకా రెండున్నరేళ్లు ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం వెనుక అంతరార్థం అదేనని అంటున్నారు. అయితే ప్రభుత్వం పడిపోదు కానీ ..  ఎదురుగాలి వీస్తోందన్న ఓ నెగెటివ్ ప్రచారం అయితే ప్రారంభమవుతుంది కదా అని అంటున్నారు. మరో వైపు టీఆర్ఎస్ ప్రతీ రోజూ ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగిస్తూనే ఉంది. ఈటల అనుచరుల్ని మళ్లీ పార్టీలోకి తీసుకుంటూనే ఉంది.  ఇలాంటి సమయంలో కేటీఆర్ మాటలు ఈటల క్యాంప్‌లోనూ చర్చకు కారణమయ్యాయి. 
  
ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఫలితం తేడా వస్తే అన్న మాటల్ని మాట్లాడదు. అలా మాట్లాడిదే నెగెటివ్ ప్రచారం ప్రారంభమవుతుంది. అయితే టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం కష్టం. పక్కా వ్యూహం ప్రకారమే కేటీఆర్ ఆ స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటే  వారు ఎలాంటి ఎఫెక్ట్ కోరుకుంటున్నారో అది వచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తే మాత్రం ఇబ్బందేనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.