తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఓసీనా.. బీసీనా..మైనార్టీనా అనే తేడా లేకుండా అందరికీ "బంధు" పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అంటే ఒక్కో పేద కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తారన్నమాట. ఆ సొమ్ముతో వారు ఉపాధి పొందవచ్చు.  వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఒక్క దళితులకే కాదు అందరికీ  "బంధు" పథకం అమలు చేస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. కానీ వారిలోనే ఇది సాధ్యమా అన్న అనుమానం కూడా ప్రారంభమయింది. 


"బంధు"  టెన్షన్‌లో ఉన్న టీఆర్ఎస్ నేతలకు రిలీఫ్..!


ప్రతి పేద కుటుంబానికి  "బంధు"  పథకం వర్తింప చేస్తామన్న కేసీఆర్ ప్రకటన టీఆర్ఎస్ నేతలకు రిలీఫ్ లాంటిది. ఎందుకంటే దళిత బంధు ప్రకటించి అమలు చేయడం ప్రారంభిచిన తర్వాత దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ నేతలకు ఆ పథకం సెగ తగిలింది. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమకూ పథకం వస్తుంది కదా అని కొంత మంది మాట్లాడటం ప్రారంభించారు. మరికొంత మంది తమకు ఎప్పుడు ఇస్తారని ధర్నాలు ప్రారంభించారు. దళితులకు మాత్రమేనా  మేము పేదలం కాదా అని ఇతర వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలంతా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వీరందరికి రిలీఫ్ ఇచ్చేలా కేసీఆర్.. పేద కుటుంబాలన్నింటికీ పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు. దీంతో నియోజకవర్గాలకు వెళ్లే టీఆర్ఎస్ నేతలు అందరికీ పథకం వర్తిస్తుందని .. భరోసా ఇచ్చి.. ప్రశాంతంగా ఉండనున్నారు.


ఎన్నికల్లోపు అమలు చేయకపోతే కష్టమని ఆందోళన..!


టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైతే కాస్త మనశ్శాంతి పొందుతారు కానీ.. ముందు ముందు చిక్కులు తప్పవన్న భయం వారిలో వెంటాడుతోంది. దీనికి కారణం ప్రజలు ఎంతో కాలం ఎదురు చూడరని.. అమలు చేయాలని ఒత్తిడి చేస్తారని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం దళిత బంధు అమలు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 21వేల దళిత కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందు కోసం మూడు విడతలుగా ఇప్పటికి రూ. 1200 కోట్లు విడుదల చేశారు. ఇంకా హుజురాబాద్‌లోనే అమలు చేయాలంటే రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలి. ఆగస్టు 16వ తేదీన దళిత బంధు ప్రారంభోత్సవ వేదిక మీద కేసీఆర్ ఒకటి రెండు నెలల్లో హుజురాబాద్‌లో దళిత బంధు అమలు పూర్తి చేస్తామన్నారు. మూడు , నాలుగేళ్లలో రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. అంటే.. ఒక్క దళిత బంధు అమలు చేయడానికే మూడు నాలుగేళ్ల పడుతుంది. కానీ రెండేళ్లలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ లెక్కన చూస్తే ఎన్నికల్లోపు దళిత బంధు కూడా పూర్తిగా అమలు కాదని టీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికల్లోపు దళితులకైనా పూర్తిగా అమలు చేయకపోతే ఇతర వర్గాల్లో నమ్మకం ఏర్పడటం కష్టమని భావిస్తున్నారు. నిజానికి దళిత బంధు పథకానికి రూ. రెండు వేల కోట్లు కేటాయించడమే ప్రభుత్వానికి కష్టంగా ఉంది. హుజూరాబాద్‌కు అవసరమైన నిధుల కోసం ఎన్నో పనులు ఆపేయాల్సి వస్తోంది. అలాంటిది రాష్ట్రం మొత్తం అమలు చేయాలంటే బడ్జెట్ మొత్తం పెట్టినా సరిపోదని ఆర్థిక నిపుణుల లెక్కలేస్తున్నారు.


ఇప్పుడే ఇవ్వాలని ప్రజల్ని రెచ్చగొట్టే వ్యూహంలో రాజకీయ పార్టీలు..!


రూ. పది లక్షలంటే చిన్న మొత్తం కాదు. పేద కుటుంబాలకు జీవితం సెటిల్ అయిపోతుంది. అందుకే ఈ పథకం తమకు ఎప్పుడు అందుతుందా అని వర్గాలకు అతీతంగా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. వీరి ఆశల్ని ప్రతిపక్ష పార్టీలు  ప్రభుత్వంపై వ్యతిరేకతగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పుడే పథకం అమలు చేయాలని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించేలా వ్యూహరచన చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో దళిత, గిరిజన దండోరా పేరుతో ప్రతీ జిల్లాకు తిరిగి చెప్పాల్సినదంతా చెబుతున్నారు. మీ సొమ్మే మీకిస్తున్నారు తెచ్చుకోవాలని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా దరఖాస్తుల ఉద్యమాన్నే ప్రారంభించారు. పథకం ప్రజలకు  ఇప్పటికే ప్రతిపక్షాలు దళితకుటుంబాలకే ఇవ్వరని.. పది మందికి ఇచ్చి ఓట్లేయించుకుని మోసం చేస్తారని విమర్శలు చేస్తున్నాయి. దానికి గ్రేటర్ ఎన్నికలకు ముందు వరద సాయం పేరుతో రూ. పదివేలు కొంత మందికి ఇచ్చి ఎన్నికలయిపోయిన తర్వాత పట్టించుకోని అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వం తీరుపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నారు.


"బంధు" ప్లాన్ బూమరాంగ్ అయితే కష్టమే..! 


తాము అధికారంలోకి వస్తే ఫలానా మేలు చేస్తాం అని చెప్పి రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ గెలిపిస్తే ఫలానా చేస్తాం అని చెప్పడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారుగా ఎందుకు చేయలేదనే ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు అదే పరిస్థితి ఉంది. "బంధు" ను అమలు చేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కనీసం సగం అమలు చేసినా ప్రజల్లో సానుకూలత వస్తుంది. లేకపోతే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.