బుధవారం తెల్లవారు జామున తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు చనిపోగా పలువురు గాయాలపాలయ్యారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆటోలో నుంచి జారి పడ్డ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 


ప్రకాశం జిల్లా తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల సరిహద్దు కలుజువ్వలపాడు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి నలుగురు వ్యక్తులు జారిపడి చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. ఆస్పత్రికి తరలించేలోగా మార్గమధ్యంలో మరో ఇద్దరు చనిపోయారు. మృతులను కనకం కార్తీక్‌, అనిల్‌, బోగాను సుబ్బారావు, శ్రీనుగా స్థానికుల సాయంతో పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లి వేడుకకు వధువును తీసుకుని త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 


వధువు ఆటో ముందు భాగంలో కూర్చోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఆ పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటనతో వధువు సహా కుటుంబ సభ్యులు, బంధు గణమంతా  కన్నీరుమున్నీరయ్యారు.


సూర్యాపేట జిల్లాలో బస్సు బోల్తా..
తెలంగాణలోనూ బుధవారం తెల్లవారు జామునే ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో కాకినాడ నుంచి వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఘటన జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం, అతివేగమే ప్రమాదానికి కారణమని మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. రాత్రి వేళ కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే బస్సు బోల్తా పడిపోయి ఉంది. దీంతో వారు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకొచ్చారు. ఇరుక్కుపోయిన వారిని తోటి ప్రయాణికులు కాపాడారు.


Also Read: Hyderabad Crime: మహిళ అత్యాశ! పోలీసులు మంచి చెప్పినా వినలేదు.. చివరికి లబోదిబో..


Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై మరో ఫిర్యాదు, మారకపోతే ప్రత్యక్ష దాడులే.. టీఆర్ఎస్ హెచ్చరిక