అఫ్గానిస్థాన్ సంక్షోభంపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు తాము ఊహించినట్లే ఉన్నాయన్నారు. అయితే అంత తక్కువ సమయంలో తాలిబన్లు అఫ్గాన్ ను ఆక్రమిస్తారని అనుకోలేదన్నారు. అమెరికా, భారత్ భాగస్వామ్యం, 21వ శతాబ్ద భద్రతపై జరిగిన సమావేశంలో బిపిన్ రావత్ ఈ మేరకు మాట్లాడారు.
అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమిస్తారని భారత్ ముందాగానే ఊహించింది. అయితే అది ఇంత త్వరగా పూర్తి అవుతుందని మేం అనుకోలేదు. అఫ్గానిస్థాన్ అంతర్గత అంశాన్ని పక్కనపెడితే అక్కడి నుంచి భారత్ కు ఏమైనా సమస్యలు తలెత్తితే ఉగ్రవాదాన్ని ట్రీట్ చేసినట్లే వాటిని ఎదుర్కొంటాం. అయితే ఇండో- పసిఫిక్, అఫ్గాన్ అంశాలను వేరువేరుగా చూడాలి. రెండూ ఈ ప్రాంతంలో భద్రతకు సవాళ్లు విసురుతున్నాయి. మా వ్యూహాలు మాకు ఉన్నాయి. భద్రతా పరంగా భారత్ చాలా బలంగా ఉంది. మన బలగాలు చాలా శక్తిమంతంగా ఉన్నాయి. - బిపిన్ రావత్, త్రిదళాధిపతి
భారత్ వ్యూహం..
అఫ్గానిస్థాన్ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడ ఉన్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే అఫ్గాన్ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో చర్చించారు.