హుజూరాబాద్‌లో దళిత ఓట్లపై ప్రేమతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ఇన్నేళ్లుగా దళిత బిడ్డను సీఎంవోలో ఉద్యోగిగా పెట్టుకోని కేసీఆర్ ఇప్పుడు ఓట్ల కోసం ఒకరిని నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ఉన్నత పదవుల్లోనూ ఏనాడూ దళితులకు అవకాశమివ్వలేదని, తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవులను వారికి అప్పగించారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ నేత ఈటల రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.


‘‘నా రాజీనామా వల్ల హుజూరాబాద్ ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతోందో అలాంటి పనులే యావత్ తెలంగాణ మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటిదాకా ఎవరైనా లబ్ధిదారులకు పెన్షన్ జారీ చేయడానికి ఓ మంత్రికి అధికారం లేకుండా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకుంటే రేషన్ కార్డు జారీ చేసే అధికారం కూడా మంత్రికి లేదు. అది కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఈనాడు నా రాజీనామాతో హుజూరాబాద్‌లో, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. దళిత బంధు కూడా హుజూరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలి. దళిత ఓట్ల కోసమే ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇప్పుడు కేసీఆర్ ఉన్నత స్థానం ఇస్తున్నారు.


Also Read: MLA Ramulu Naik: సోనియాను పొగిడేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీలో తీవ్ర చర్చ.. వీడియో వైరల్


దిగజారుతున్న సీఎం ప్రతిష్ఠ
ఇండియా టుడే సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠ, పలుకుబడి 84 శాతం తగ్గిపోయింది. టాప్ 10 మంది సీఎంలలో ఎక్కడా ఆయన పేరు లేదు. హుజూరాబాద్‌లో దళిత బంధు పెట్టినప్పటికీ కూడా ప్రజలు కేసీఆర్‌పై అసహనంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఉప ఎన్నికల కోసమే కేసీఆర్ పెడుతున్నారని అంటున్నారు. దళిత బంధు, పెన్షన్లు అన్ని తీసుకొని మా బిడ్డ ఈటల రాజేందర్‌నే గెలిపించుకుంటామని ప్రజలంతా చెబుతున్నారు. సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి. ఈటల మాత్రమే గెలవనున్నారని అందరూ అంటున్నారు.


ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి ఎవరి జాగాలల్లో వాళ్లకు వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వాలని కోరుతున్నా. అలాగే సీఎం ఆఫీసులో దళిత ఆఫీసర్‌ను ఎలా నియామకం చేశారో, అలాగే ఓ బీసీ, ఎస్టీ, మైనారిటీ అధికారులను కూడా నియమించాలి. ఇప్పటికైనా దళిత బంధును హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి’’ అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.


Also Read: MLA Ramulu Naik: సోనియాను పొగిడేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీలో తీవ్ర చర్చ.. వీడియో వైరల్