తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ను బురిడి కొట్టించేందుకు కొంత మంది కేటుగాళ్లు గట్టి ప్లానే వేశారు. ఏకంగా రూ. కోటి నొక్కేద్దామని ప్రయత్నించారు. అయితే గుంగుల కమలాకర్ భయపడకుండా కాస్తంత చొరవ తీసుకోవడం ఈ ఫేక్ ఈడీ ముఠా గుట్టు రట్టయింది. అయితే అసలు వీరెవరో ఇంత వరకూ బయటకు తెలియలేదు. ఇప్పుడీ వ్యవహారం కలకలరం రేపుతోంది. కొద్ది రోజులుగా కరీంనగర్ రాజకీయాల్లో  గ్రానైట్ వ్యాపారులపై ఈడీ నిఘా అనే చర్చ నడుస్తోంది. రాజకీయ పార్టీలనేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు వచ్చాయని ఓ నోటీస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


మంత్రి గంగుల కమలాకర్ కుటుంబం  చాలా కాలంగా గ్రానైట్ బిజినెస్‌లో ఉన్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంపై ఆయనకు పట్టు ఉంది. గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని.. ఎగుమతులు చేస్తూ కూడా లెక్కలు చెప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఈడీకి ఫిర్యాదులు అందాయి.  ప్రస్తుతం ఈడీ ఇతర విషయాలపైనా విచారణ చేపట్టిందని..  కరీంనగర్‌ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్‌ విదేశాలకు తరలించారనే అంశంపై ఆరా తీస్తోందని... ఆయా సంస్థలను రికార్డులు అడిగిందన్న ప్రచారం జరిగింది. కానీ తమకు కానీ.. తమ సరుకును రవాణా చేస్తున్న సంస్థలకు కానీ ఎటువంటి ఈడీ నోటీసులు అందలేని కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు ప్రకటించారు. అదంతా తప్పుడు ప్రచారమని పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ ఎపిసోడ్ అంతటితో ముగిసిపోయిందనుకునే సమయంలో మంత్రి గుంగుల కుటుంబసభ్యులకు ఈడీ పేరుతో నోటీసు వచ్చింది. 
 
గ్రానైట్ అక్రమ రవాణా కేసులో గంగుల కమలాకర్  సోదరులను అరెస్ట్‌ చేస్తామని, అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసు తేడాగా ఉండటంతో మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులను సంప్రదించారు. వారికి నోటీసులు చూపించారు. కానీ వారు తాము నోటీసులు పంపలేదని స్పష్టం చేశారు. వెంటనే.. తమ పేరుతో నకిలీ నోటీసులు పంపడంతో  ఈ నకిలీ నోటీసుపై ఈడీ అధికారులు సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు గంగుల వద్ద అదనపు సమాచారం తీసుకున్నారు.  అయితే ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారని అనుకున్నారేమో కానీ.. మంత్రి మాత్రం ఫిర్యాదు జోలికి వెళ్లలేదు. 


మొత్తంగా ఈడీ పేరు చెబితే .. అరెస్ట్ చేయకుండా రూ. కోటి తెచ్చి ఇస్తారని ఆశలు పెట్టుకున్న కేటుగాళ్లకు మంత్రి గంగుల షాకిచ్చారు. ఇంతకీ ఆ నోటీసులు ఎవరు పంపారో తేలితే కానీ ఆ ముఠా గురించి బయటకు తెలియదు. డబ్బులిస్తామని పిలిచి పట్టుకుని ఉంటే గుట్టురట్టయ్యేది కానీ.. నకిలీ నోటీసుపైనే కేసు పెట్టడంతో వారి వివరాలు బయటకు రావడం కాస్తంత కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు.