తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈరోజు (ఆగస్టు 25) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్ధన్‌ తెలిపారు. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్షల ఫలితాలను మాత్రమే నేడు విడుదల చేయనున్నారు. వ్యవసాయ, ఫార్మసీ ఎంసెట్ ఫలితాలను తర్వాత వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్షలు ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరిగాయి. విద్యార్థులు తమ ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో చూసుకోవచ్చు. 


టీఎస్ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 9 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలన.. సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లకు సెప్టెంబరు 4 నుంచి 13వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 


సెప్టెంబరు 15 నుంచి సీట్ల కేటాయింపు.. 
ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను సెప్టెంబరు 15వ తేదీన కేటాయించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 15 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని విద్యార్థులకు సూచించారు. అయితే రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను మాత్రం వెల్లడించాలేదు. త్వరలోనే ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 
సెప్టెంబర్ 1 లేదా 2న అగ్రికల్చర్ ఫలితాలు
ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను సెప్టెంబర్ 1 లేదా 2వ తేదీన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ, ఫార్మసీ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 9, 10 తేదీల్లో జరిగాయి. 


ఇంటర్ వెయిటేజ్ రద్దు.. 
ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల విద్యాశాఖ ప్రకటించింది. గతంలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఇచ్చేవారు. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులేనని అధికారులు ప్రకటించారు.


Also Read: TS Inter Exams: సెప్టెంబర్‌లో తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. వారికి మాత్రమే..


Also Read: JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. కింద లింక్ ఉంది..