Supreme Court on Adani Row


అదానీ అంశంపై విచారణ..


హిండన్‌బర్గ్-అదానీ అంశం దాదాపు పది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు..ఇన్వెస్టర్ల పెట్టుబడులను రక్షించాల్సిన అవసరముందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సెబీ జోక్యం చేసుకుని నియంత్రణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించింది. ఫిబ్రవరి 13న విచారణను వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం దీనిపై ప్రత్యేకంగా  ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. నిపుణులను నియమించి ఇన్వెస్టర్ల భద్రతకు భరోసా కల్పించే విధానాలు అనుసరించాలని తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్‌లు పడిపోవటం వల్ల మదుపరులు లక్షల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించింది. అదానీ గ్రూప్ మొత్తంగా 100 బిలియన్ డాలర్ల సంపద పోగొట్టుకుందని తెలిపింది. 


"భారత మదుపరులు లక్షల కోట్లు నష్టపోయారు. రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల పెట్టుబడులకు ఎలా భరోసా ఇవ్వగలం. భవిష్యత్‌లో ఇలాంటివి జరగవు అని ఎలా చెప్పగలం. సెబీ ఈ విషయంలో ఏం చేస్తుంది" 






-సుప్రీంకోర్టు ధర్మాసనం


వచ్చే సోమవారం నాటికి సెబీ దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని స్పష్టం చేసింది. 


"మేమిచ్చే సలహా ఒకటే. విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి. సెబీ రెగ్యులేటరీపై ఎలాంటి అనుమానాలూ ఉండకూడదు. విచారణ చేస్తే కానీ ఈ రెగ్యులేటరీలో ఏమైనా సంస్కరణలు చేయాలా అన్నది తేలుతుంది. ఓ దశ దాటిన తరవాత పాలసీ డొమైన్‌లో మేం జోక్యం చేసుకోం. కానీ భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా కచ్చితంగా ఓ మెకానిజం తీసుకురావాలి" 


- సుప్రీం కోర్టు ధర్మాసనం