Viveka murder Case :   అరెస్టయి జైల్లో ఉన్న వైఎస్  వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను ఇక నుంచి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లోనే ఉంచనున్నారు. వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేయడంలో  తొలి సారిగా శుక్రవారం విచారణ జరిగింది.   విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. నిందితులు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.   తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది.         


నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ ఇప్పటికే కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు.ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను ఇటీవల సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు ఎస్‌సీ/01/2023 నంబర్‌ కేటాయించింది. కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టులో అప్పగించారు.                   


 2019 మార్చి 15న వివేకా పులివెందులలోని సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. 2019 మార్చిలో వైఎస్‌ వివేకా హత్య జరగ్గా తొలుత గుండెపోటు మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. హత్య జరిగిన ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి పలు విడతలుగా సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తోంది. కడప జిల్లాకు వెళ్లి క్షేత్రస్థాయిలో సాక్ష్యాధారాల్ని సేకరించాయి. విచారణ నత్తనడకన సాగుతుండడంతో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  దీంతో సుప్రీంకోర్టు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీచేసింది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలకు సమన్లు జారీఅయ్యాయి.        


సీబీఐ ఇటీవల వివేకా హత్య కేసులో దూకుడు పెంచింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో పని చేసే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ అనే ఇద్దరు ఉద్యోగుల్ని  కడప సబ్ జైలుకు పిలిపించి ప్రశ్నించారు. ముందు ముందు మరికొంత మందికి నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా సున్నితమైన కేసు కావడంతో ఈ కేసులో ప్రతీ అంశం హైలెట్ అవుతోంది. కడప కోర్టు నుంచి నిందితుల్ని ఇక హైదరాబాద్ జైల్లోనే ఉంచనున్నారు. మరో వైపు ఏ వన్ గా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను కూడా తెలంగాణ హైకోర్టు విచారించనున్నారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై... సుప్రంకోర్టు..  తెలంగాణ హైకోర్టు విచారించాలని ఆదేశిచింది. త్వరలో ఈ అంశంపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.