Supreme Court Adani Row: 


పిటిషన్ వేసిన అడ్వకేట్..


హిండన్‌బర్గ్ - అదానీ అంశంపై దాదాపు నెల రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అదానీ గ్రూప్ షేర్‌లూ ఒక్కసారిగా కుప్ప కూలాయి. హిండన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌పై అదానీ స్వయంగా స్పందించినా లాభం లేకుండా పోయింది. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. అయితే...మీడియాలో పదేపదే హిండన్‌బర్గ్ రిపోర్ట్‌ గురించి ప్రస్తావించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వార్తల్ని ప్రసారం చేసే మీడియాను బ్యాన్ చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మీడియాపై నిషేధం విధించడం కుదరదని తేల్చి చెప్పింది. తాము కేవలం తీర్పు మాత్రమే ఇవ్వగలమని, బ్యాన్ చేయడం సరికాదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అడ్వకేట్ ఎల్ఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. అయితే..ఇప్పటికే హిండన్‌బర్గ్‌ రిపోర్ట్‌కు సంబంధించిన నాలుగు పిటిషన్లను రిజర్వ్‌లో పెట్టింది సర్వోన్నత న్యాయస్థానం. అదానీ గ్రూప్‌ మోసం చేసిందంటూ ఈ పిటిషన్‌లలో ప్రస్తావించారు. పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎల్ఎల్ శర్మ...SEBI జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. అంతే కాదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విచారణ జరిపించాలని,  హిండన్ బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్‌పై కేసు నమోదు చేయాలని  పిటిషన్‌లో పేర్కొన్నారు. మీడియా దీన్ని రిపోర్ట్ చేయకుండా కట్టడి చేయాలని కోరారు. సుప్రీం కోర్టు మాత్రం ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 


అదాని హిండన్‌బర్గ్ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీ నియమించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు SEBI కొందరి పేర్లను ప్రతిపాదించింది. SEBI తరపున వాదించే సోలిసిటర్ జనరల్ ఈ వివరాలు కోర్టుకి సమర్పించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కమిటీకి లీడర్‌గా నియమించే నిర్ణయం కోర్టుదేనని తేల్చి చెప్పారు సోలిసిటర్ జనరల్. అయితే...SEBI ప్రతిపాదించిన పేర్ల జాబితాను సీల్డ్‌ కవర్‌లో అందించడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలో కోర్టే నిర్ణయిస్తుందని, అలా అయితే తప్ప పారదర్శకత ఉండదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జ్‌ నేతృత్వంలో కమిటీని నియమించలేమని, ఆ బాధ్యతను మాజీ జడ్జ్‌కే అప్పగిస్తామని స్పష్టం చేసింది  ధర్మాసనం. 


"మేం ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఆమోదిస్తే అది ప్రభుత్వం నియమించిన కమిటీ అయిపోతుంది. ఈ కమిటీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలి" 


-సుప్రీంకోర్టు  ధర్మాసనం


ఫిబ్రవరి 10 వ తేదీన సుప్రీం కోర్టు "ప్రత్యేక కమిటీ" నియమించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అంగీకరించిన కేంద్రం ఆ కమిటీలోని సభ్యుల పేర్లనూ కోర్టు ముందుంచింది. అయితే...ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ నియమించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ SEBI అన్ని విధాలుగా పారదర్శకంగా ఉందని తేల్చి చెప్పింది.


Also Read:


Ideas of India Summit 2023: ధర్మం వైపు నిలబడడమే మా సిద్ధాంతం, భారతీయుడిగా ఎంతో గర్వంగా ఉంది - ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే